'మన దిగ్గజ ఆటగాళ్లను గుర్తించడం లేదు'
న్యూఢిల్లీ:కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచిన భారత హాకీ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ షాహిద్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని రాజ్యసభ వేదికగా పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. దేశానికి ఎంతో సేవ చేసిన షాహిద్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే సాయాన్ని అందించి ఆదుకోవాలన్నారు. గురువారం రాజ్యసభ జీరో అవర్లో మాజీ హాకీ ఆటగాడు, ఎంపీ దిలీప్ టిర్కే(బీజేడీ) ఈ అంశాన్ని లేవనెత్తగా దానికి పలువురు ఎంపీలు మద్దతు తెలిపారు.
'చాలామంది ప్రస్తుత భారత హాకీ ఆణిముత్యాలకు షాహిద్ ఒక రోల్ మోడల్. అతని సేవల్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. మనం చాలా మంది క్రీడా దిగ్గజాల్ని పట్టించుకోవడం లేదు. ఒక క్రికెట్ కే గుర్తింపు ఇచ్చి.. మిగతా క్రీడా దిగ్గజాలను పక్కకు పెడుతున్నాం. షాహిద్ మరణం వారి కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది కల్గించకూడదు. అలా జరగాలంటే ప్రభుత్వం తక్షణమే వారికి సాయం చేయాలి' అని దిలీప్ విన్నవించారు. అటు ప్రతిపక్ష ఎంపీలతో పాటు ప్రభుత్వ ఎంపీలు కూడా టిర్కే అభిప్రాయంతో ఏకీభవించారు.