పార్లమెంట్కు రండి.. జీతాలు పెంచుకోండి
పార్లమెంట్ సభ్యులకు రాజ్యాంగ నిపుణుడు నారిమన్ సూచన
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులూ ఎంపీలందరూ తమ సమయాన్ని పూర్తిగా సభకు కేటాయించి, సమావేశాలకు హాజరుకావడం ఎంతో అవసరమని రాజ్యాంగ నిపుణుడు ఫాలి నారిమన్ అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలందరూ పూర్తిగా తమ సమయాన్ని కేటాయిస్తే, వాళ్లు వంద శాతం జీతాలు పెంచుకోవడానికి అర్హులని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్లో చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదని, సభ కార్యకాలపాలను అడ్డుకుంటున్నారని అన్నారు. అంతేగాక సమావేశాలకు చాలా మంది ఎంపీలు సరిగా హాజరుకాకపోవడం ఆక్షేపణీయమని చెప్పారు.
బాలనేరస్తుల సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని ఫాలి నారిమన్ స్వాగతించారు. దీన్ని మంచి పరిణామంగా తాను భావిస్తున్నట్టు చెప్పారు. బాలనేరస్తుల వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. తీవ్ర నేరాలకు పాల్పడిన కేసుల్లో 16 ఏళ్లు దాటిన వారిని పెద్దవారిగా పరిగణించి శిక్షలు వేయనున్నారు. కాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.