juvenile justice bill
-
పార్లమెంట్‌కు రండి.. జీతాలు పెంచుకోండి
పార్లమెంట్ సభ్యులకు రాజ్యాంగ నిపుణుడు నారిమన్ సూచన న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులూ ఎంపీలందరూ తమ సమయాన్ని పూర్తిగా సభకు కేటాయించి, సమావేశాలకు హాజరుకావడం ఎంతో అవసరమని రాజ్యాంగ నిపుణుడు ఫాలి నారిమన్ అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలందరూ పూర్తిగా తమ సమయాన్ని కేటాయిస్తే, వాళ్లు వంద శాతం జీతాలు పెంచుకోవడానికి అర్హులని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్లో చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదని, సభ కార్యకాలపాలను అడ్డుకుంటున్నారని అన్నారు. అంతేగాక సమావేశాలకు చాలా మంది ఎంపీలు సరిగా హాజరుకాకపోవడం ఆక్షేపణీయమని చెప్పారు. బాలనేరస్తుల సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని ఫాలి నారిమన్ స్వాగతించారు. దీన్ని మంచి పరిణామంగా తాను భావిస్తున్నట్టు చెప్పారు. బాలనేరస్తుల వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. తీవ్ర నేరాలకు పాల్పడిన కేసుల్లో 16 ఏళ్లు దాటిన వారిని పెద్దవారిగా పరిగణించి శిక్షలు వేయనున్నారు. కాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. -
'రేపిస్ట్‌లను కాల్చిచంపేవాడిని'
న్యూఢిల్లీ: 'నిర్భయ స్థానంలో నా కూతురే ఉండి ఉంటే ఆ ఘాతుకానికి పాల్పడినవారిని కాల్చి చంపేవాడిని' అని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఆవేశపడ్డారు. ఆ వాఖ్యను బీజేపీ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్ తప్పుబడ్తూ.. అది సమాజంలోకి తప్పుడు సందేశం పంపిస్తుందన్నారు. నేరాలకు పాల్పడే పిల్లల్లో చాలామంది పేదరికం, అవిద్య నేపథ్యం నుంచి వచ్చినవారేనని కహకషన్ పర్వీన్(జేడీయూ) పేర్కొన్నారు. 'నేరాలకు పాల్పడుతున్న పిల్లల సామాజిక, ఆర్థిక నేపథ్యంపై సమగ్ర అధ్యయనం అవసరం. బాల నేరస్తుల కేంద్రాలు నేరస్తుల తయారీ కేంద్రాలుగా మారాయి' అని కే కేశవరావు(టీఆర్ఎస్) పేర్కొన్నారు. బాల నేరస్తుల సవరణ బిల్లు చట్టంగా మారకముందు జరిగిన నేరాలకు.. ఇందులోని నిబంధనలు వర్తించబోవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. -
నేరం మెదడుదా, మనిషిదా?
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఢిల్లీ బస్సులో నిర్భయపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో బాల నేరస్థుడి శిక్షను పొడిగించకుండా విడుదల చేయడంపై నేడు దేశంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లగా, 18 ఏళ్ల లోపు మైనర్లు ఎంతటి హీనాతి హీనమైన నేరం చేసినా వారిని మూడేళ్లకు మించి శిక్షించలేమని, చట్టం అలా ఉందని, అందుకు తాము చేయగలిగిందీ ఏమీ లేదంటూ చేతులు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో బాల నేరస్థుల వయో పరిమితిని 18 నుంచి 16కు తగ్గిస్తూ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లును అర్జంటుగా ఆమోదించాలంటూ పార్లమెంట్ లోపల, వెలుపల ఆందోళన తీవ్రమైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. ప్రజాపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు మంగళవారం నాటి రాజ్యసభ షెడ్యూల్లో జువెనైల్ బిల్లును ప్రభుత్వం చేర్చింది. ఈ బిల్లును ఆమోదించడం వల్ల సమాజంలో వచ్చే మార్పులు ఏమిటీ, కలిగే ప్రయోజనాలేమిటీ? ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని సమాజంలో బాల నేరస్థులు పెరిగి పోతున్నారా? కఠినంగా శిక్షించినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయా? బాల నేరస్థుల వయో పరిమితిని 16 ఏళ్లకు కుదించడం వల్ల నేరాలను అరికట్టగలమా ? 16 ఏళ్ల లోపు పిల్లలు నేరాలు చేయడం లేదా? అసలు వయస్సుకు, నేరాలకు సంబంధం ఉందా ? ఉందంటుందీ సైన్స్. మంచి, చెడులను విశ్లేషించేది, మానవ ప్రవర్తనను నియంత్రించేది, నిర్దేశించేది మెదడులోని ‘ఫ్రంటల్ కార్టెక్స్’. పాశ్చాత్య శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం 16 ఏళ్ల వయస్సుకు ఫ్రంటల్ కార్టెక్స్ పరిపూర్ణ దశకు చేరుకుంటుంది. భారత్ లాంటి వర్ధమాన దేశాల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల ప్రకారం 18 ఏళ్ల వయస్సుకు భారతీయుల్లో ఫ్రంటల్ కార్టెక్స్‌కు పరిపక్వత వస్తోంది. అందుకే భారత్‌లో జువెనైల్ చట్టం పరిమితిని 18 ఏళ్లుగా నిర్దేశించారు. పాశ్చాత్య దేశాలకు, మనకూ రెండేళ్ల వయస్సు తేడా ఎందుకనే సందేహం ఇక్కడ కలగవచ్చు. కుటుంబ నేపథ్యం, సామాజిక పరిస్థితులు మెదడుపై ప్రభావం చూపించడమే అందుకు కారణం. భారత్ లాంటి దేశాల్లో 16, 18 ఏళ్ల నాటికి ఫ్రంటల్ కార్టెక్స్ పరిపక్వత సాధించినప్పటికీ మంచి, చెడులను విశ్లేషించి ఓ మార్గాన్ని ఎంచుకోవడాని వీలుగా మెదడు ఎదగడానికి 21, 22 ఏళ్లు పడుతుందని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బెంగళూరులోని ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సెన్సైస్’ లాబరేటరీలో మెదడుపై పరిశోధనలు చేస్తున్న సుమంత్రా ఛటర్జీ తెలియజేస్తున్నారు. (సెంటర్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ రిపేర్‌కు ఛటర్జీ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు) మెదడును స్వభావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే రెండు కోణాల నుంచి చూడాల్సి ఉంటుందని, అందులో ఒకటి సైన్స్ కాగా, మరొకటి సొసైటీ అని ఆయన చెబుతారు. మనం చేసే పనుల ఫలితం ఎలా ఉంటుందీ? ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సముచితమో మెదడులోని ఫ్రంటల్ కార్టెక్స్ తేల్చడానికి 21, 22 ఏళ్లు రావాల్సిందేనన్నది ఛటర్జీ వాదన. కొన్ని రోజులపాటు మానసిక ఒత్తిడికి గురైనా సరే మెదడులోని న్యూరాన్స్‌లో మార్పులు కలిగి ఫ్రంటల్ కార్టెక్స్ కుంచించుకుపోతుందని, మెదడులో భావోద్రేకాలకు కారణమయ్యే ‘అమిగ్దాల’ రెచ్చిపోతుందని, ఫలితంగా మెదడు సముచిత నిర్ణయం తీసుకోలేదని ఛటర్జీ చెబుతున్నారు. కుటుంబ నేపథ్యం, బాల్యంలో ఎదురైన అనుభవాలు, దారిద్య్రం లాంటి సామాజిక పరిస్థితులు మెదడుపై ఒత్తిడికి కారణమవుతాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2014 సంవత్సరంలో నేరాలకు పాల్పడిన బాలల్లో 55.6 శాతం మంది ఏడాదికి 25 వేల రూపాయలలోపు ఆదాయం కలిగిక కుటుంబాలకు చెందిన వారే. 53 శాతం మంది నిరక్షరాస్యులు, ఐదవ తరగతిలోపు చదువుకున్న పిల్లలే. సామాజిక పరిస్థితుల ప్రభావం ఉంటుందనడానికి ఈ లెక్కలు ఓ ఉదాహరణ మాత్రమే. చెడు దారి పట్టిన మెదడు, అంటే చెడుదారి పట్టిన బాలలను మంచి దారికి తీసుకురావడం అంత ఈజీ కాదు. శిక్షా పరిష్కారం కాదు. పునరావాస కేంద్రాల్లో శాస్త్రీయంగా శిక్షణ ఇవ్వడం ఒక్కటే మార్గం. ఈ మార్గం మాత్రం భారత్‌లో ఆశించిన ఫలితాల్విదు. అరకొర సౌకర్యాలుగల బాల నేరస్థుల పునరావాస కేంద్రాలు కిక్కిరిసి పోవడం, చాలినంత సిబ్బంది లేకపోవడం, కావాల్సిన కౌన్సిలర్లు, నిపుణుల కొరత ఫలితాలకు ప్రతిబంధకం. -
వయసు తగ్గిస్తే నేరాలు తగ్గుతాయా?
జువైనెల్ చట్టంలో సవరణ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును సీపీఎం వ్యతిరేకిస్తోంది. 16 ఏళ్ల వయసున్న బాలురను వయోజనులుగా పరిగణించడం పూర్తిగా తప్పని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన సవరణకు తాము వ్యతిరేమని, రాజ్యసభలో దీన్ని అడ్డుకుంటామన్నారు. సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పరిశీలనకు పంపించాలని ఆమె డిమాండ్ చేశారు. బాల నేరస్తుడిని తీవ్రవవాదులను ఉంచే జైలుకు తరలించడాన్ని తప్పు బట్టిన ఆమె.. వయసు తగ్గించినంత మాత్రం స్త్రీలపై హింస ఆగుతుందని, న్యాయం జరుగుతుందని తాము భావించడం లేదన్నారు. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసే పటిష్టమైన వ్యవస్థ కావాలన్నారు. మరోవైపు అసలు ఈ బిల్లు తీసుకురావొద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చట్ట సవరణ చేయాల్సి వస్తే తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరగాలని బాలల హక్కుల కార్యకర్త కుమార్ వీ జాగిర్దార్ డిమాండ్ చేశారు. అటు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కాగా నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో శిక్షపడిన బాలనేరస్తుడి విడుదలను వ్యతిరేకిస్తున్న నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ మహిళా సంఘం నేతలు పోరాటానికి దిగారు. -
రాహుల్ హామీయిచ్చారు: ఆశాదేవి
న్యూఢిల్లీ: జువైనల్ జస్టిస్ చట్టసవరణ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీయిచ్చారని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. రాజ్యసభలో బిల్లు ఆమోదానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మంగళవారం రాహుల్ గాంధీని ఆమె కలిశారు. మరోవైపు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఈ ఉదయం నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర మంత్రి ముక్తాస్ అబ్బాస్ నఖ్వీని కలిశారు. జువైనల్ జస్టిస్ చట్టసవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందేలా చూడాలని కోరారు. బిల్లు ఆమోదానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని వారికి మంత్రి హామీయిచ్చారు. కాగా, బిల్లు ఆమోదంపై కాంగ్రెస్, జేడీ(యూ), ఎన్సీపీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. జువైనల్ జస్టిస్ చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్‌లో ఉండడం తెలిసిందే. -
'నిర్భయ' ఘటనతో వారి జీవితం నిర్ణయిస్తారా?'
న్యూఢిల్లీ: జువైనెల్ చట్టంలో సవరణ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు వద్దే వద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు నిరసన చేపట్టారు. హీనమైన నేరాలతో సంబంధం ఉండే 16 నుంచి 18 ఏళ్ల వయసుగల వారికి కూడా శిక్ష పడేలా సవరణ చేసేందుకు ఉద్దేశించిన జువైనెల్ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం చర్చిస్తామని కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఆ బిల్లు తీసుకురావొద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన లేవనెత్తారు. 'దురదృష్టవశాత్తు జరిగిన ఒక నిర్భయలాంటి కేసు మొత్తం బాల నేరస్తుల జీవితాన్ని నిర్ణయించలేదని మేం అనుకుంటున్నాం' అని బాలల హక్కుల కార్యకర్త కుమార్ వీ జాగిర్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే బాల నేరస్తుల విషయంలో పలుమార్లు ఉద్దేశించిన చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు. ఒక వేళ ఇందులో చట్ట సవరణ చేయాల్సి వస్తే తప్పనిసరిగా దేశ వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.