'రేపిస్ట్‌లను కాల్చిచంపేవాడిని'
న్యూఢిల్లీ: 'నిర్భయ స్థానంలో నా కూతురే ఉండి ఉంటే ఆ ఘాతుకానికి పాల్పడినవారిని కాల్చి చంపేవాడిని' అని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఆవేశపడ్డారు. ఆ వాఖ్యను బీజేపీ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్ తప్పుబడ్తూ.. అది సమాజంలోకి తప్పుడు సందేశం పంపిస్తుందన్నారు. నేరాలకు పాల్పడే పిల్లల్లో చాలామంది పేదరికం, అవిద్య నేపథ్యం నుంచి వచ్చినవారేనని కహకషన్ పర్వీన్(జేడీయూ) పేర్కొన్నారు.
'నేరాలకు పాల్పడుతున్న పిల్లల సామాజిక, ఆర్థిక నేపథ్యంపై సమగ్ర అధ్యయనం అవసరం. బాల నేరస్తుల కేంద్రాలు నేరస్తుల తయారీ కేంద్రాలుగా మారాయి' అని కే కేశవరావు(టీఆర్‌ఎస్) పేర్కొన్నారు. బాల నేరస్తుల సవరణ బిల్లు చట్టంగా మారకముందు జరిగిన నేరాలకు.. ఇందులోని నిబంధనలు వర్తించబోవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.