రాహుల్ హామీయిచ్చారు: ఆశాదేవి
న్యూఢిల్లీ: జువైనల్ జస్టిస్ చట్టసవరణ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీయిచ్చారని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. రాజ్యసభలో బిల్లు ఆమోదానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మంగళవారం రాహుల్ గాంధీని ఆమె కలిశారు. మరోవైపు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.
ఈ ఉదయం నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర మంత్రి ముక్తాస్ అబ్బాస్ నఖ్వీని కలిశారు. జువైనల్ జస్టిస్ చట్టసవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందేలా చూడాలని కోరారు. బిల్లు ఆమోదానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని వారికి మంత్రి హామీయిచ్చారు.
కాగా, బిల్లు ఆమోదంపై కాంగ్రెస్, జేడీ(యూ), ఎన్సీపీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. జువైనల్ జస్టిస్ చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్‌లో ఉండడం తెలిసిందే.