నేరం మెదడుదా, మనిషిదా? | Changes in juvenile law crime against kids, say experts | Sakshi
Sakshi News home page

నేరం మెదడుదా, మనిషిదా?

Published Tue, Dec 22 2015 2:33 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

నేరం మెదడుదా, మనిషిదా?

నేరం మెదడుదా, మనిషిదా?

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఢిల్లీ బస్సులో నిర్భయపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో బాల నేరస్థుడి శిక్షను పొడిగించకుండా విడుదల చేయడంపై నేడు దేశంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై  సుప్రీం కోర్టుకు వెళ్లగా, 18 ఏళ్ల లోపు మైనర్లు ఎంతటి హీనాతి హీనమైన నేరం చేసినా వారిని మూడేళ్లకు మించి శిక్షించలేమని, చట్టం అలా ఉందని, అందుకు తాము చేయగలిగిందీ ఏమీ లేదంటూ చేతులు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో బాల నేరస్థుల వయో పరిమితిని 18 నుంచి 16కు తగ్గిస్తూ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లును అర్జంటుగా ఆమోదించాలంటూ పార్లమెంట్ లోపల, వెలుపల ఆందోళన తీవ్రమైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. ప్రజాపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు మంగళవారం నాటి రాజ్యసభ షెడ్యూల్‌లో జువెనైల్ బిల్లును ప్రభుత్వం చేర్చింది.

ఈ బిల్లును ఆమోదించడం వల్ల సమాజంలో వచ్చే మార్పులు ఏమిటీ, కలిగే ప్రయోజనాలేమిటీ? ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని సమాజంలో బాల నేరస్థులు పెరిగి పోతున్నారా? కఠినంగా శిక్షించినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయా? బాల నేరస్థుల వయో పరిమితిని 16 ఏళ్లకు కుదించడం వల్ల నేరాలను అరికట్టగలమా ? 16 ఏళ్ల లోపు పిల్లలు నేరాలు చేయడం లేదా? అసలు వయస్సుకు, నేరాలకు సంబంధం ఉందా ? ఉందంటుందీ సైన్స్.

మంచి, చెడులను విశ్లేషించేది, మానవ ప్రవర్తనను నియంత్రించేది, నిర్దేశించేది మెదడులోని ‘ఫ్రంటల్ కార్టెక్స్’. పాశ్చాత్య శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం 16 ఏళ్ల వయస్సుకు ఫ్రంటల్ కార్టెక్స్ పరిపూర్ణ దశకు చేరుకుంటుంది. భారత్ లాంటి వర్ధమాన దేశాల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల ప్రకారం 18 ఏళ్ల వయస్సుకు భారతీయుల్లో ఫ్రంటల్ కార్టెక్స్‌కు పరిపక్వత వస్తోంది. అందుకే భారత్‌లో జువెనైల్ చట్టం పరిమితిని 18 ఏళ్లుగా నిర్దేశించారు. పాశ్చాత్య దేశాలకు, మనకూ రెండేళ్ల వయస్సు తేడా ఎందుకనే సందేహం ఇక్కడ కలగవచ్చు. కుటుంబ నేపథ్యం, సామాజిక పరిస్థితులు మెదడుపై ప్రభావం చూపించడమే అందుకు కారణం.

భారత్ లాంటి దేశాల్లో 16, 18 ఏళ్ల నాటికి ఫ్రంటల్ కార్టెక్స్ పరిపక్వత సాధించినప్పటికీ మంచి, చెడులను విశ్లేషించి ఓ మార్గాన్ని ఎంచుకోవడాని వీలుగా మెదడు ఎదగడానికి 21, 22 ఏళ్లు పడుతుందని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బెంగళూరులోని ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సెన్సైస్’ లాబరేటరీలో మెదడుపై పరిశోధనలు చేస్తున్న సుమంత్రా ఛటర్జీ తెలియజేస్తున్నారు. (సెంటర్ ఫర్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అండ్ రిపేర్‌కు ఛటర్జీ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు) మెదడును స్వభావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే రెండు కోణాల నుంచి చూడాల్సి ఉంటుందని, అందులో ఒకటి సైన్స్ కాగా, మరొకటి సొసైటీ అని ఆయన చెబుతారు.

మనం చేసే పనుల ఫలితం ఎలా ఉంటుందీ? ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సముచితమో మెదడులోని ఫ్రంటల్ కార్టెక్స్ తేల్చడానికి 21, 22 ఏళ్లు రావాల్సిందేనన్నది ఛటర్జీ వాదన. కొన్ని రోజులపాటు మానసిక ఒత్తిడికి గురైనా సరే  మెదడులోని న్యూరాన్స్‌లో మార్పులు కలిగి ఫ్రంటల్ కార్టెక్స్ కుంచించుకుపోతుందని, మెదడులో భావోద్రేకాలకు కారణమయ్యే ‘అమిగ్దాల’ రెచ్చిపోతుందని, ఫలితంగా మెదడు సముచిత నిర్ణయం తీసుకోలేదని ఛటర్జీ చెబుతున్నారు.  కుటుంబ నేపథ్యం, బాల్యంలో ఎదురైన అనుభవాలు, దారిద్య్రం లాంటి సామాజిక పరిస్థితులు మెదడుపై ఒత్తిడికి కారణమవుతాయి.

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2014 సంవత్సరంలో నేరాలకు పాల్పడిన బాలల్లో 55.6 శాతం మంది ఏడాదికి 25 వేల రూపాయలలోపు ఆదాయం కలిగిక కుటుంబాలకు చెందిన వారే. 53 శాతం మంది నిరక్షరాస్యులు, ఐదవ తరగతిలోపు చదువుకున్న పిల్లలే. సామాజిక పరిస్థితుల ప్రభావం ఉంటుందనడానికి ఈ లెక్కలు ఓ ఉదాహరణ మాత్రమే. చెడు దారి పట్టిన మెదడు, అంటే చెడుదారి పట్టిన బాలలను మంచి దారికి తీసుకురావడం అంత ఈజీ కాదు. శిక్షా పరిష్కారం కాదు. పునరావాస కేంద్రాల్లో శాస్త్రీయంగా శిక్షణ ఇవ్వడం ఒక్కటే మార్గం. ఈ మార్గం మాత్రం భారత్‌లో ఆశించిన ఫలితాల్విదు. అరకొర సౌకర్యాలుగల బాల నేరస్థుల పునరావాస కేంద్రాలు కిక్కిరిసి పోవడం, చాలినంత సిబ్బంది లేకపోవడం, కావాల్సిన కౌన్సిలర్లు, నిపుణుల కొరత ఫలితాలకు ప్రతిబంధకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement