
గువాహటి : దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు జరుగుతున్న వేళ అసోం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం రోజున దాదాపు గంట వ్యవధిలో అసోంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దిబ్రుగర్‌లో రెండు ఎల్‌ఈడీ బ్లాస్ట్‌లు జరగగా.. సోనారి, దులియాజన్, దూమ్‌దూమా ప్రాంతాల్లో గ్రానేడ్ పేలుళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.
అసోంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లను ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ఖండించారు. ‘రిపబ్లిక్ డే రోజున బీభత్సం సృష్టించేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనకు కారకులపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుద’ని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. నిషేధిత యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఈ పేలుళ్లుకు పాల్పడి ఉండోచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అసోం ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలకు దూరంగా.. ఈ సంస్థ పిలుపునిచ్చింది.