
‘అందరూ నన్ను అనుమానంగా చూస్తున్నారు’
ముంబై: తాను తీవ్రవాదిని కాదని చెప్పాలంటూ ముంబైలో ఓ వ్యక్తి ప్లకార్డు పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. వాట్సాప్ లో తనపై తీవ్రవాది ముద్ర వేశారని వాపోయాడు. తనను తీవ్రవాదిగా పేర్కొంటూ వాట్సాప్ లో పోస్టు చేసిన మెసేజ్ లు, ఫొటోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విరార్ పోలీస్ స్టేషన్ లో సయీద్ అలీ ఖాన్(30) అనే వ్యక్తి మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
మొదట ఖాన్ ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ సందర్భంగా ‘నా పేరు సయీద్ అలీ ఖాన్. నేను తీవ్రవాదిని కాదు’ అని రాసున్న ప్లకార్డులు ప్రదర్శించారు. విరార్ లోని గోపచద్ పాడా ప్రాంతంలో ఖాన్ నివసిస్తున్నాడు. తన ఇంటి యజమాని అదనంగా రూ. 2 వేలు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోవడంతో తాను తీవ్రవాది అంటూ వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నాడని వాపోయాడు. తనను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని రాశాడని చెప్పాడు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందరూ తనను అనుమానంగా చూస్తున్నారని పోలీసులకు ఖాన్ తెలిపాడు.