ధైర్య లలానీ, విశ్వ
సాక్షి, ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మృతుల్లో అమెరికా గ్రీన్‌కార్డు కలిగిన యువకుడు కూడా ఉన్నాడు. కమలా మిల్స్ కాంపౌండ్‌లో గురువారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో ధైర్య లలానీ(26), అతడి సోదరుడు విశ్వ(23), వీరి పిన్ని ప్రమీల కెనియా(70) మృతి చెందారు.
అమెరికాలో ఉంటున్న ధైర్య.. సెలవులు గడిపేందుకు ఇటీవల ముంబైకి వచ్చాడు. గురువారం రాత్రి తన సోదరుడు, బంధువులతో కలిసి కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ‘వన్ ఎబౌ’ హోటల్‌కు వెళ్లాడు. ఊహించని విధంగా మంటలు వ్యాపించడంతో వీరంతా చెల్లాచెదురయ్యారు. బంధువులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమీల చిక్కుకుపోవడంతో ఆమెను కాపాడబోయి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ‘మంటలు వ్యాపించాయని తెలియగానే మేమంతా పరుగెత్తుకుంటూ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నాం. కింది ఫ్లోర్‌కు వచ్చాక ప్రమీల మాతో పాటు రాలేదని గుర్తించాం. ఆమెను రక్షించేందుకు ధైర్య, విశ్వ మళ్లీ పైకి వెళ్లార’ని వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు తెలిపారు.
వెంటిలేషన్ అవుట్‌లెట్ లేకపోవడంలో ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని పోలీసులు చెప్పారు. కనీసం 35 మందిని కాపాడామని, 21 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులపై ఐపీసీ 304, 337, 338 కింద ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment