
జకీర్ ప్రసంగాలపై ముంబై పోలీసుల నివేదిక
ముంబై: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ప్రసంగాలపై దర్యాప్తు జరిపిన ముంబై పోలీసులు నివేదిక సమర్పించారని మహారాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయ్ సత్‌బీర్ సింగ్ మంగళవారం తెలిపారు. ఈ నివేదికను హోం మంత్రిత్వ శాఖ పరిశీలించిన తరువాత తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపుతారని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా ముంబై పోలీసులు సోమవారం... నాయక్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ ఐఆర్‌ఎఫ్ ఉద్యోగితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. జూలై 1న ఢాకాలోని ఓ రెస్టారెంట్‌పై దాడిచేసిన తీవ్రవాదుల్లో కొందరు జకీర్ ప్రసంగాలతో ఉత్తేజితులయ్యారని ఆరోపణలు రావడంతో ఆయనపై పలు దర్యాప్తు సంస్థలు నిఘా పెంచాయి. ఆయన బోధనలు యువకులు తీవ్రవాద సంస్థల్లో చేరేలా స్ఫూర్తినిచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న జకీర్ ప్రసంగాలపై ముంబై పోలీసులు దర్యాప్తు జరిపారు.
ఐఆర్‌ఎఫ్‌కు విదేశాల నుంచి అందిన ఆర్థిక వనరుల నిగ్గు తెల్చేందుకు కూడా ముంబై పోలీసులు ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఉమ్మడి విచారణను కొనసాగిస్తున్నారు. జూలై 15న సౌదీ అరేబియా నుంచి స్కైప్ ద్వారా మీడియాతో మాట్లాడిన నాయక్ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.