
సాక్షి, ముంబై: ముంబైని వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. వర్షం కారణంగా ముంబైలోని ప్రధాన దారులన్నీ జలదిగ్భందమయ్యాయి. సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే జనాలు.. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల వల్ల అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిసింది. వర్షం కారణంగా అంధేరిలో ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.
నావీ ముంబైలోని వశీ ప్రాంతంలో ఉదయం తొమ్మిది గంటకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. అసలే అది లోతట్టు ప్రదేశం కావటంతో వర్షాలు కురిసిన ప్రతీసారి నీటమునడం పరిపాటిగా మారింది. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా జుహు, వసాయ్ వంటి ప్రాంతాలు నీటమునగగా.. శివారు ప్రాంతాలన్నీ ట్రాఫిక్ దిగ్భందంలో చిక్కుకుపోయాయి. జోగేశ్వరి హైవే నుంచి ఐఐటీ పోవై వరకు, బోరివ్లి నుంచి శాంతాక్రజ్ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. బాంద్రాలోని ఎస్వీ రోడ్డులో నీటిముంపు కారణంగా ట్రాఫిక్ మళ్లించారు.
నగరంలోనే కాక పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ట్విట్టర్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. అటు వాతావరణ శాఖ కూడా ముంబై, థానే ప్రాంతాల్లో శుక్రవారం తీవ్ర వర్షాలు కురుస్తాయంటూ ముందుగానే హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో మ్యాన్‌హోల్స్‌ను తెరవద్దంటూ బీఎంసీ నగరవాసులను కోరింది. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ గ్రిల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది.

Comments
Please login to add a commentAdd a comment