ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో ముస్లింలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదివారం సాయంత్రం ముంబైలోరి మదన్‌పురా రహదారిపై కొంతమంది విద్యార్థులు, మహిళల బృందం సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఉపసంహరించుకునే వరకు తాము రోడ్డుపై నుంచి వెళ్లమని భీష్మించుకున్నారు. సుమారు 60 నుంచి 70 మంది విద్యార్థులు, మహిళలు సీఏఏను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
ఈ నిరసనలకు నాయకత్వం వహించిన న్యాయ విద్యార్థిని ఫాతిమా మాట్లాడుతూ.. ‘కేంద్రప్రభుత్వం నియంతలా ప్రవర్తిస్తోంది. సీఏఏపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్‌ను అడ్డుకోవడం సరైనది కాదు. అదేవిధంగా సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ మహిళలు నిరసన కార్యక్రమల్లో పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం’ అని ఆమె మండిపడ్డారు. (షాహీన్‌బాగ్‌లో జెండా ఎగురవేసిన బామ్మలు)
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో నిరవధికంగా జరుగుతున్న నిరసనలను స్ఫూర్తిగా తీసుకొని సీఏఏను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించే వరకు తాము నిరసనలు కొనసాగిస్తామని మరో విద్యార్థిని తెలిపారు. అదే విధంగా సుప్రీంకోర్టు ఈ చట్టంపై సరైన నిర్ణయం తీసుకునే వరకు తమ నిరసనలను ఎట్టిపరిస్థితుల్లో ఆపమని ఆమె పేర్కొన్నారు. గత 40 రోజుల నుంచి సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో ప్రజలు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
షాహీన్ బాగ్ తరహాలో ముంబైలో నిరసన
Published Mon, Jan 27 2020 5:25 PM | Last Updated on Mon, Jan 27 2020 5:50 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment