
దిస్పూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తూ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను అమలు చేస్తూ మళ్లీ తెరపైకి తీసుకురావటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.
అస్సాం రాష్ట్రంలో కూడా సీఏఏ అమలుపై వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ) జాబితాలో నమోదు చేసుకోనివారికి ఒక్కరికైనా కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ కింద పౌరసత్వం కల్పిస్తే.. తన సీఎం పదవి రాజీనామ చేస్తామని తెలిపారు.
‘నేను అస్సాం పుత్రుడను. ఒక్క వ్యక్తి అయినా ఎన్‌ఆర్‌సీలో నమోదు కాకుండా సీఏఏ ద్వారా పౌరసత్వం పొందితే మొదట నేనే నా పదవికి రాజీనామా చేస్తా. సీఏఏ అనేది కొత్త చట్టం కాదు. గతంలో కూడా ఇలాంటి చట్టం ఉంది. పారదర్శంగా ప్రజలు నమోదు చేసుకునేందుకు పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చాం. అయినా ప్రజలు విధుల్లో నిరసన తెలపటంలో అర్థం లేదు. ఈ చట్టం సరైందో? కాదో? అని విషయాన్ని.. సమాచారంతో కూడిన పోర్టల్ తెలియజేస్తుంది’ అని శివసాగరల్‌లోని ఓ కార్యక్రమంలో సీఎం హిమంత అన్నారు.
సీఏఏ అమలుపై నిరసన తెలుపుతున్న పలు సంఘాలపై పోలీసుల నోటీసులు పంపారు. అయినప్పటికీ నిరసనలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 16 పార్టీల యునైటెట్ అపోజిషన్ పోరం అస్సాం( యూఓఎఫ్‌ఏ) సీఏఏ అమలుపై నిరసన చేపడతామని ప్రకటన విడదల చేసిన విషయం తెలిసిందే.