సాక్షి, న్యూఢిల్లీ : ‘ మీరు అన్ని పుష్పాలను తుంచి వేయవచ్చు. కానీ రానున్న వసంతాన్ని మాత్రం ఆపలేవు’ ఈ కవిత గానమై ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో మారుమ్రోగిపోతోంది. పాబ్లో నెరుడా రాసిన ఈ కవిత నాడు చిలీలో జరిగిన విద్యార్థి ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. నాడు ఆయన దేశంలో నియంతత్వ పాలనకు వ్యతిరేకంగా 20కిపైగా కవితలు రాశారు.
కవితలు, పాటలు ఉద్యమాలు, విప్లవాల నుంచి పుడతాయి. మళ్లీ అలాంటి ఉద్యమాలకే ఊపరిపోస్తాయి. అందుకే ‘పాట ఉద్యమం అవుతుంది. ఉద్యమం పాట అవుతుంది’ అంటూ గొంతెత్తిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా పాటే ఆయుధమైంది. నేడు ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో ఆయా ప్రాంతాలకు చెందిన పాటలు, కవితలు ఆయా ప్రాంతాల్లో మారుమ్రోగుతున్నాయి. ఆందోళనకు కొత్త ఊపునిస్తున్నాయి.
వరుణ్ గోవర్ హిందీలో రాసిన తిరుగుబాటు కవిత ‘హమ్ కాగజ్ నహీ దిఖాయింగే’కు మంచి స్పందన కనిపిస్తోంది. ఇది సోషల్ మీడియాలో లక్షలసార్లు చెక్కర్లు కొడుతోంది. అస్సాంలో ‘ఐయామ్ మియా, మై ఎన్‌ఆర్‌సీ నెంబర్ సో అండ్ సో, ఐ గాట్ టూ చిల్డ్రన్, అనదర్ ఈజ్ కమింగ్ నెక్స్›్ట సమ్మర్, విల్ యు హేట్ హిమ్ యాజ్ యూ హేట్ మీ’ కవిత కూడా పాటై ప్రజలను ఆందోళన బాటలో నడిపిస్తోంది.
2017లో వచ్చిన డాక్యుమెంటరీ చిత్రం ‘న్యూటన్’లోని ‘చల్ తూ అప్‌నా కామ్ కర్’ అనే పాట కూడా ఆందోళనకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. నక్సలైట్ల బెడద ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల పర్వత ప్రాంతంలో ముగ్గురు ఓటర్ల కోసం ఆరుగురు ఎన్నికల సిబ్బంది అడవుల గుండా కాలి నడకన కిలీమీటర్ల దూరం నడిచి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇతివృత్తంగా ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఎవరి పని వారు కచ్చితంగా చేయాల్సిందే అనే అర్థమిచ్చే ఈ పాటను ఆ చిత్రంలో నటుడు రఘుబీర్ యాదవ్ పాడారు.
Comments
Please login to add a commentAdd a comment