పాకిస్తాన్‌ పైశాచికం | Mutilating of jawans 'pre-planned operation by Pakistan Army' | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ పైశాచికం

Published Tue, May 2 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

పాకిస్తాన్‌ పైశాచికం

పాకిస్తాన్‌ పైశాచికం

పూంచ్‌ సెక్టార్లో ఇద్దరు భారత జవాన్ల తలలు నరికివేత
► 250 మీటర్లు చొచ్చుకొచ్చి మరీ దాడికి పాల్పడ్డ పాక్‌ బీఏటీ బృందం
► మోర్టార్లు, తుపాకులతో భారత పోస్టులపై ఆదివారం రాత్రినుంచీ దాడులు


జమ్మూ/న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది . పదేపదే కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ కవ్విస్తున్న పాక్‌.. ఈ సారి మరీ బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ.. పెట్రోలింగ్‌ చేస్తున్న ఇద్దరు భారత జవాన్లపై దాడి చేసి అత్యంత క్రూరంగా వారి తలలు నరికేసింది. ఉగ్రవాదుల సాయంతో సరిహద్దుల్లో భారత సైన్యంపై దాడులకు తెగబడుతున్న పొరుగుదేశం.. ఈసారి ఏకంగా ఆర్మీనే రంగంలోకి దించి దొంగదెబ్బ కొట్టింది. పాక్‌ సైన్యం ఓవైపు సరిహద్దు వెంబడి భారత పోస్టులపై మోర్టార్లతో దాడికి తెగబడగా.. పాక్‌ సరిహద్దు భద్రతా దళం (బీఏటీ) బృందం 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.

ఆదివారం రాత్రి నుంచి యథేచ్చగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్‌ను కవ్వించిన పాక్‌.. సోమవారం ఉదయం జవాన్లను కిరాతకంగా చంపేసింది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత జవాన్ల తలలు నరికిన పాక్‌ ఆర్మీ చర్య అనాగరికమని భారత రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ మండిపడ్డారు. పాకిస్తాన్‌కు దీటైన సమాధానం ఇవ్వక తప్పదన్నారు. కాగా పాక్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా పర్యటించి.. కశ్మీర్‌ ఆందోళనలకు తమ మద్దతుంటుందని ప్రకటించిన మరునాడే ఈ దాడులు జరగటం గమనార్హం.

దాడెలా జరిగింది?
పాకిస్తాన్‌ ఆర్మీలోని ప్రత్యేక బలగాలతో రూపొందించిందే సరిహద్దు కార్యాచరణ దళం (బీఏటీ). పూంచ్‌ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఇద్దరు భారత జవాన్ల తలలను తెగనరికింది ఈ బీఏటీ బృందమే. పాక్‌ ఆర్మీ చీఫ్‌ పర్యటన తర్వాత పాకిస్తాన్‌ వ్యూహాత్మకంగా భారత్‌పై దాడికి వ్యూహరచన చేసింది. ముందుగా వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం పూంచ్‌ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్‌లోని రెండు భారత ఫార్వర్డ్‌ డిఫెన్స్‌ కేంద్రాల (కిర్పాణ్, పింపుల్‌ పోస్టులు)పై ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో రాకెట్లు, మోర్టార్లతో దాడిచేశాయి. భారత్‌ దీన్ని ప్రతిఘటించే ప్రయత్నాల్లో ఉండగానే.. బీఏటీ సభ్యులు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి 250మీటర్లు చొచ్చుకొచ్చారు. పాక్‌ దాడినుంచి తట్టుకునేందుకు పోస్టులో ఉన్న భారత జవాన్లు బయటకు రాగానే వారిని అంతం చేయాలనేది బీఏటీ యోచన.

కనీసం 7–8 మంది జవాన్లను మట్టుబెట్టాలనే వ్యూహంతో చాలా సేపటినుంచే బీఏటీ సభ్యులు మాటువేశారని భారత ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్‌ ఆర్మీ దాడులకు భారత పోస్టులు ప్రతిఘటిస్తూనే మధ్య మధ్యలో విరామమిచ్చాయి. ఈ సమయంలో పోస్టులకు సహాయంగా రావాలంటూ పెట్రోలింగ్‌ పార్టీలకు సమాచారం అందటంతో.. సమీపంలోని పెట్రోలింగ్‌ బలగాలు ఈ పోస్టులవైపు బయలుదేరాయి. ఈ క్రమంలో ఇద్దరు (ఓ జవాన్, మరో బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌) మాత్రం వెనకబడిపోయారు.

దీంతో వీరిద్దరినీ కాల్చి చంపిన పాక్‌ బలగాలు ఆ తర్వాత శిరచ్ఛేదనానికి పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. మృతిచెందిన వారిని 22వ సిఖ్‌ ఇన్‌ఫాంట్రీకి చెందిన నాయిబ్‌ సుబేదార్‌ పరమ్‌జీత్‌ సింగ్, బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్‌ (200వ బెటాలియన్‌)గా గుర్తించినట్లు తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డ బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ రాజిందర్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో శ్రీనగర్‌కు వచ్చిన ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌  ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇలా జరిగి ఉండొచ్చేమో!: పాకిస్తాన్‌ బీఏటీ బృందం పన్నిన ఉచ్చులో చిక్కుకునే ఇద్దరు భారతీయ జవాన్లు చనిపోయి ఉండొచ్చనే ఆర్మీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. భారత భూభాగంలో సరిహద్దు వెంబడి పాక్‌ బలగాలు మందుపాతరలు అమర్చి ఉండొచ్చని ఇటీవలే ఇంటెలిజెన్స్‌ సమాచారమిచ్చింది.

అయితే ఈ మందుపాతరలను కనిపెట్టేందుకు ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ సంయుక్త బృందం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలోనే ఔట్‌ పోస్టులపై పాక్‌ కవ్వింపు చర్యకు సమాధానమిచ్చే ప్రయత్నంలో భాగంగా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి వేచి చూస్తున్న పాక్‌ బీఏటీ బృందం వలలో వీరిద్దరూ చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. భారత్‌ తీవ్రంగా ప్రతిస్పందించిన నేపథ్యంలో పాక్‌ ఆర్మీ స్పందిస్తూ.. ‘నియంత్రణ రేఖ వెంబడి మేం ఎలాంటి దాడులు చేయలేదు. భారత్‌ పేర్కొన్నట్లుగా భారత సైనికుల శిరచ్ఛేదం అవాస్తవమని ఓ ప్రకటనలో తెలిపింది.

వారి భాషలోనే బదులివ్వాలి: పాక్‌ తీరును భారతీయ రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్తాన్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానమివ్వాలని బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్‌ అన్నారు. ఇలాంటి ఘటనల ద్వారా పాకిస్తాన్‌ తన నాశనాన్ని తనే కోరుకుంటోందని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ తెలిపారు. ప్రభుత్వం మొద్దునిద్రలోంచి మేల్కొనాలని కాంగ్రెస్‌ సూచించింది. ‘ప్రధాని 56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది?’ అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు.  పాకిస్తాన్‌ తీరును ఖండించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ.. దౌత్యపరంగా పాక్‌తో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేలా విపక్షాలతో కేంద్రం సంప్రదింపులు జరపాలన్నారు.  

పాక్‌కు దీటైన సమాధానం ఇస్తాం
ఇద్దరు భారత సైనికుల తలలు నరకటంపై రక్షణ మంత్రి జైట్లీ తీవ్రంగా స్పందించారు. ‘పాక్‌ ఆర్మీ చర్య అమానవీయం, అనాగరికం. యుద్ధం జరుగుతన్న సమయంలోనూ ఇంత క్రూరంగా వ్యవహరించరు. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. యావద్భారతానికి మన సాయుధ బలగాలపై పూర్తి నమ్మకముంది. దీనికి దీటైన సమాధానం ఇవ్వక తప్పదు. జవాన్ల త్యాగం వృధాకాదు’ అని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్తాన్‌కు సరైన సమాధానం ఇచ్చేందుకు భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘పాకిస్తాన్‌ ఆదివారం రాత్రి నుంచీ నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లతో దాడి ద్వారా కవ్వింపు చర్యలకు దిగింది. ఇదే సమయంలో బీఏటీ బృందం భారత పెట్రోలింగ్‌ బలగాలపై మెరుపుదాడి చేసింది. అత్యంత క్రూరంగా ఇద్దరు భారతీయ జవాన్ల తలలను తెగనరికింది. పాక్‌ చేసిన ఈ అమానవీయ ఘటనకు  ఆర్మీ దీటైన సమాధానం ఇస్తుంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆరు నెలల్లో మూడో ఘటన
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్‌ దురాగతాలకు అంతే లేకుండా పోతోంది. గత ఆరునెలలో జవాన్ల తలలు నరకటం ఇది మూడోసారి. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ఇలాంటి రెండు ఘటనలు జరిగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు ఘటనలు మచిల్‌ సెక్టార్లోనే జరిగాయి. కార్గిల్‌ యుద్ధ సమయం నుంచి అడపాదడపా పాక్‌ ఇలాంటి క్రూరమైన చర్యలకు ఒడిగడుతోంది.

అక్టోబర్, నవంబర్‌ 2016: నియంత్రణ రేఖ వెంబడి మచిల్‌ సెక్టార్‌పై దాడికి పాల్పడిన పాక్‌ సైనికులు ఇద్దరు భారత జవాన్లను చంపి వీరి తల నరికారు.
జనవరి 2013: లాన్స్‌నాయక్‌ హేమ్‌రాజ్, లాన్స్‌నాయక్‌ సుధాకర్‌ సింగ్‌లను చంపి  తలలు నరికేశారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ రాజిందర్‌ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
జూన్‌ 2008: కేల్‌ సెక్టార్‌లో దారితప్పిన ఓ గోర్ఖా రైఫిల్స్‌ జవాన్‌ను బీఏటీ బృందం బందీగా పట్టుకుంది. కొంతకాలానికి ఆ జవాను శవం తలలేకుండా లభ్యమైంది.
ఫిబ్రవరి 2000: పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాది ఇలియాస్‌ కశ్మీరీ భారత ఔట్‌పోస్టుపై మెరుపుదాడికి పాల్పడి ఏడుగురు భారత జవాన్లను క్రూరంగా చంపేశాడు. అంతే కాకుండా 17 మరాఠా ఇన్‌ఫాంట్రీకి చెందని భావుసాహెబ్‌ మారుతి తాలేకర్‌ అనే 24 ఏళ్ల జవాను తలను నరికి పాకిస్తాన్‌ తీసుకెళ్లాడు.
1999 కార్గిల్‌ యుద్ధం: కెప్టెన్‌ సౌరభ్‌ కాలియాను పట్టుకుని చిత్రహింసలు పెట్టిన పాకిస్తాన్‌ ఆర్మీ అనంతరం తలనరికి భారత్‌కు మృతదేహాన్ని అప్పగించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement