
న్యూఢిల్లీ: 2012 రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన దివంగత నేత బాల్ థాకరేను తాను కలవడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ విషయాన్ని తాను రాసిన ‘ది కొలేషన్ ఇయర్స్’ పుస్తకంలో ప్రణబ్ పేర్కొన్నారు. తాను 2012 జూలై 13వ తేదీన థాకరేను ఆయన ఇంట్లో కలసినట్లు ప్రణబ్ చెప్పారు.
థాకరేతో భేటీ కావద్దని సోనియా సూచించారని, అయితే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచన మేరకు థాకరేను కలసినట్లు చెప్పారు. తర్వాత ఢిల్లీకి చేరుకున్న తనని కాంగ్రెస్ నాయకురాలు గిరిజా వ్యాస్ కలిశారని చెప్పారు. ‘థాకరేతో నేను సమావేశం కావడం పట్ల సోనియా, అహ్మద్ పటేల్ అసంతృప్తిగా ఉన్నారని గిరిజా వ్యాస్ నాతో చెప్పారు. వారి అసంతృప్తికి గల కారణాన్ని నేను అర్థం చేసుకున్నాను’ అని ప్రణబ్ తెలిపారు.