న్యూఢిల్లీ: 2012లో రాష్ట్రపతి అభ్యర్థిగా తనను కాకుండా.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపాదిస్తారని భావించానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాజా పుస్తకం ‘కొలిషన్ ఇయర్స్’లో 2012లో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఆయన ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వంలో, పార్లమెంట్లో తాను పోషిస్తున్న కీలక పాత్రను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయకపోవచ్చని భావించానని ప్రణబ్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 2007లోనూ ఆ కారణంగానే తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు.
‘2012 జూన్ 2న సోనియాగాంధీతో సమావేశమయ్యాను. ప్రణబ్‌జీ.. రాష్ట్రపతి పదవికి మిమ్మల్ని మించిన అభ్యర్థి వేరెవరూ లేరు. కానీ మన ప్రభుత్వంలో మీరు పోషిస్తున్న కీలక పాత్రనూ విస్మరించలేం. అందువల్ల రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి వేరెవరి పేరునైనా మీరు చెప్పగలరా? అని సోనియా నన్ను ప్రశ్నించారు. మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా బద్ధుడినై ఉంటానని జవాబిచ్చి వచ్చేశాను. అయితే, ఆ సమావేశం తరువాత ఇంటికి వెళ్లాక.. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నాటి ప్రధాని మన్మోహన్‌ను ఎంపిక చేసి, నన్ను ప్రధానిగా నియమిస్తారేమోనన్న ఆలోచన నాకు వచ్చింది.
ఈ విషయంపై ఆమె తీవ్రంగా ఆలోచించారని కూడా నాకు తరువాత తెలిసింది’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ఒక సందర్భంలో.. పార్లమెంట్లో విపక్షాల ఆరోపణలకు దీటుగా బదులిచ్చిన తరువాత.. ‘అందుకే మిమ్మల్ని రాష్ట్రపతి చేయలేను’ అని సోనియా అనడాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో ప్రస్తావించారు. జూన్‌లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌ను ప్రకటించారు. ఆ తర్వాతి ఘటనలను ప్రణబ్ వివరిస్తూ.. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ప్రకటించాక సోనియా నాకు ఉద్వేగభరిత వీడ్కోలునిచ్చారు. తర్వాత నావైపు చిరునవ్వుతో చూస్తూ.. మీ శక్తిసామర్థ్యాలనే కాదు, మీ ఆగ్రహావేశాలనూ ఇక మిస్ అవుతాం అన్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment