మన్మోహన్ పేరు చేర్చండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను నిందితునిగా చేర్చేలా సీబీఐని ఆదేశించాలని ఓ న్యాయవాది గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బొగ్గుక్షేత్రాల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, అప్పటి బొగ్గుశాఖ కార్యదర్శి పిసి.పరేఖ్‌ల పేర్లను ఆ ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది.
అయితే, అందులో ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును కూడా చేర్చాలని ఎంఎల్.శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ కుంభకోణంలో తాను నిందితుడినైతే ప్రధాని కూడా నిందితుడేనని పరేఖ్ చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని మన్మోహన్ పేరును కూడా నిందితునిగా చేర్చాలని శర్మ అభ్యర్థించారు. ఏయే కంపెనీలకు బొగ్గు క్షేత్రాలు కేటాయించేదీ ప్రధానికి తెలుసునని, తాను కుట్రదారుడినైతే ప్రధాని మన్మోహన్‌తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరూ కుట్రదారులేనని పరేఖ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.