ట్రంప్‌కు మోదీ ఝలక్
అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఘాటుగా సమాధానమిచ్చారా? అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా డెలావేర్‌లో జరిగిన సభలో ట్రంప్ మాట్లాడినప్పుడు భారతీయ యాసను వెక్కిరించారు. అందుకు సమాధానంగానే నరేంద్ర మోదీ అమెరికా కాంగ్రెస్ సభలో గట్టి కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ 45 నిమిషాలు మాట్లాడారు. అందులో అనేక విషయాలను చెబుతూనే మధ్యలో స్పెల్ బీ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. అమెరికా భారత్ రెండు దేశాలను అనుసంధానం చేస్తున్న విశిష్ట వారధి ఆ దేశంలో పనిచేస్తున్న 30 లక్షల మంది భారతీయ అమెరికన్లు అని, అమెరికాలో ఉత్తమ సీఈవోలుగా, అధ్యాపకులుగా, వ్యోమగాములుగా, శాస్త్రవేత్తలుగా, ఆర్థిక వేత్తలుగా, వైద్యులుగా ఉన్నారన్న విషయాన్ని మోదీ గుర్తుచేస్తూనే అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్పెల్‌బీ చాంపియన్లు కూడా భారతీయ అమెరికన్ పిల్లలే అవుతున్నారని గుర్తుచేశారు.
భారతీయ భాష, యాసలను కించపరిచేలా మాట్లాడిన ట్రంప్‌కు గట్టి సమాధానంగానే స్పెల్ బీ అంశాన్ని మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అమెరికాలో ప్రతి ఏటా నేషనల్ స్పెల్ బీ పోటీలు నిర్వహిస్తారు. అందులో గత కొన్నేళ్లుగా భారత సంతతి విద్యార్థులే విజేతలు అవుతున్నారు. 2016 లో నిహార్ జంగా (టెక్సాస్), జైరాం హత్వార్ (న్యూయార్క్) స్పెల్ బీ పోటీల్లో గెలిచారు. 2015లో గోకుల్ వెంకటాచలం, వన్య శివశంకర్, కావ్యలు టైటిల్ కైవసం చేసుకున్నారు. అలాగే 2014లో అన్సున్ సుజోయ్, శ్రీరాం హత్వార్, 2013లో అరవింద్ మహంకాలి, 2012లో స్నిగ్దా నందిపతి, 2011లో సుకన్యా రాయ్, 2010లో అనామికా వీరమణి స్పెల్ బీ కాంటెస్ట్ గెలుచుకున్నారు. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 25 రౌండ్ల పాటు జరిగే ఈ పోటీల్లో ఈ ఏడాది ఫైనల్ రౌండుకు వచ్చిన 285 మందిలో దాదాపు 70 మంది భారతీయ సంతతికి చెందిన వారే ఉండటం గమనార్హం. దీంతో పాటు నేషనల్ జాగ్రఫిక్ బీ పోటీల్లో కూడా భారత సంతతి పిల్లలే విజేతలు అవుతున్నారు. 2005 నుంచి ఇప్పటివరకు ఇలా కీలకమైన స్పెల్ బీ పోటీల్లో దాదాపు 80 శాతం భారత సంతతి విద్యార్థులే గెలుచుకుంటూ వస్తున్నారు.
ట్రంప్ ఏమన్నారు....
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతూ అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి భారతీయ ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కారు. భారతీయ ఇంగ్లిష్ యాసలో మన దేశానికి చెందిన కాల్‌సెంటర్ ఉద్యోగిని వెక్కిరిస్తూ డెలావేర్ సభలో ట్రంప్ మాట్లాడారు. తన క్రెడిట్ కార్డ్ కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ విభాగం అమెరికాలో ఉందా..? విదేశంలో పనిచేస్తుందో తెలుసుకునేందుకు గతంలో చేసిన ఫోన్‌కాల్ వివరాల్ని ప్రస్తావించారు. కార్డు వివరాలు తెలుసుకునే కారణంతో ఫోన్ చేసి కస్టమర్ కేర్ ప్రతినిధిని 'నువ్వు ఎక్కడి వాడివి' అని ప్రశ్నించానని చెప్పారు. ఉద్యోగి సమాధానాన్ని భారతీయ యాసలో వెకిలిగా ఉచ్చరిస్తూ... 'నేను భారత్ నుంచి' అని సమాధానం వచ్చిందని ట్రంప్ చెప్పారు. 'చాలా మంచిది, అద్భుతం' అంటూ ఫోన్ పెట్టేశానన్నారు.