►2018లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు
►ఆయా రాష్ట్రాలకు పెద్ద పీట
►కులాల ఈక్వేషన్లు ప్రధానమే
►అన్నిప్రాంతాలకు ప్రాతినిధ్యం?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రివర్గాన్ని 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో పునర్ వ్యవస్థీకరిస్తున్నారు. దాదాపు 12మందిని తొలగించి.. అదే స్థాయిలో కొత్తవారిని తీసుకోవడంతో పాటు ప్రస్తుత మంత్రివర్గ శాఖలలో మార్పులు, చేర్పులు చేయన్నారు. మంత్రివర్గంలోకి పెద్ద ఎత్తున కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకే ఇలా మోదీ-షా ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కొత్తవారిని కేబినెట్‌లో చేర్చుకునే దానిపై నాలుగు ప్రధాన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రాంతీయ అసమానతలు
దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు అనే వాదన చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కొత్తవారికి మోదీ చోటు కల్పిస్తున్నారు. ప్రధానంగా యూపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పూర్వాంచల్ వాసులే. పశ్చిమ యూపీ నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో పశ్చిమ యూపీకి ఈ విస్తరణలో అవకాశం కల్పించవచ్చు. ఇక తమిళనాడు ఏఐఏడీఎంకేకు ఉభయసభల్లో 50మంది సభ్యులున్నారు. వీరికి విస్తరణలో పదవులు లభించే అవకాశం ఉంది.
రాష్ట్రాల్లో ఎన్నికలు
వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. మోదీ ప్రభుత్వంలో ఇప్పటివరకూ రాజస్థాన్‌కు కేబినెట్ ర్యాంక్ లేదు.. కానీ ఈ రాష్ట్రం నుంచి బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఈ విస్తరణలో పెద్దపీట వేయనున్నారు.
కులాల ఈక్వేషన్లు
ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జాట్లు, సిక్కులు గెలుపోటములను తీవ్ర ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఢిల్లీలోని బవానా శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బీజేపీ ఓటమికి ప్రధాన కారణం జాట్లే. ఈ నేపథ్యంలో జాట్లకు తగిన ప్రాతినిథ్యం కల్పించే వీలుంది.
మంత్రుల పనితీరు
వరుస రైలు ప్రమాదాలకు బాధ్యత వహించిన సురేష్ ప్రభు తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన్ను రక్షణ లేదా పర్యావరణ శాఖకు మార్చే అవకాశం ఉంది. ఇక ఉపరితల రవాణా శాఖ మంత్రిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నితిన్ గడ్కరికీ రైల్వే శాఖ అదనంగా కేటాయించవచ్చు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్ రెండుమూడు శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖకే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
కేబినెట్‌లో కొత్త ముఖాలు ఎందుకు?!
Published Sat, Sep 2 2017 1:41 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM
Advertisement
Advertisement