
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. మోడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సరంభంలోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు-చేర్పులకు రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థికమత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాయంత్రం భేటీ కానున్నారు.
ఈసారి మార్పులు-చేర్పులు భారీగానే ఉంటాయని వినిపిస్తోంది. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలకు కెబినెట్ బెర్త్ లభించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి యూపీ నేతలు పలువురికి చాన్స్ లభించవచ్చునని సమాచారం. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టమైన సమాచారం లభించడంతో రాష్ట్రపతి భవన్ లోనూ ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
కేబినెట్ లో ప్రధాన శాఖలకు చెందిన మంత్రుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఇక రసాయనాలు ఎరువుల శాఖ సహాయమంత్రి నిహాల్ చంద్‌పై, మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాపై వేటు పడొచ్చని తెలుస్తోంది. అదేవిధంగా రాజస్థాన్ నేత అర్జున్ మేఘవాల్, జబల్‌పుర్ ఎంపీ రాకేశ్ సింగ్, అసోంకు చెందిన ఎంపీ రమణదేకాతోపాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధేలను కేబినెట్ లోకి కొత్తగా తీసుకోవచ్చునని సమాచారం.