ఈ టెర్రరిస్టుల్లో ఒక్కరినైనా చంపామా!? | Narendra Modi Record on Terrorism | Sakshi
Sakshi News home page

ఈ టెర్రరిస్టుల్లో ఒక్కరినైనా చంపామా!?

Published Sat, Mar 2 2019 2:52 PM | Last Updated on Sat, Mar 2 2019 2:52 PM

Narendra Modi Record on Terrorism - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను తక్కువ మాట్లాడుతా, ఎక్కువ పనిచేస్తా! పాకిస్థాన్‌లో తలదాచుకున్న దావుద్‌ ఇబ్రహీం లాంటి వారిని పట్టుకురావడంలో యూపీఏ ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. కేవలం మాటలు చెబితే సరిపోదు. టెర్రరిజమ్‌పై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పదే పదే చెప్పారు. టెర్రరిజంపై తాను నిజంగా పోరాడతానని, వట్టి మాటలు చెప్పనన్నది మోదీ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది. 

ఇప్పుడు 2019 వచ్చింది. అంటే మోదీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. మరి ఆయన ప్రభుత్వం కూడా దావూద్‌ ఇబ్రహీంను పట్టుకోలేక పోయింది. ఒక్క ఆయన్నే కాదు, టాప్‌ టెర్రరిస్టులను పట్టుకోవడంగానీ, కాల్చివేయడంగానీ చేయలేక పోయింది. భారత్‌ హిట్‌ లిస్ట్‌లో ఉండి పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న టైగర్‌ మెమన్, అబ్దుల్‌ సుబాన్‌ ఖురేషి, ఇక్బాల్‌ భక్తల్, మీర్జా షాదాబ్‌ బేగ్, అమిర్‌ రాజా ఖాన్, మొహమ్మద్‌ ఖలీద్‌ ఆకా సాగిర్, భారత ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానాన్ని హైజాక్‌ చేసిన ఖలిస్థాన్‌ టెర్రరిస్టులు వాధవ సింగ్‌ బబ్బర్, పరంజిత్‌ సింగ్‌ పాంజ్‌వర్, లఖ్బీర్‌ సింగ్‌ రోడే, రంజిత్‌ సింగ్‌ నీతా, గజిందర్‌ సింగ్‌లలో ఏ ఒక్కరిని పట్టుకోలేక పోయారు. చంపలేక పోయారు. ఇక హఫీద్‌ సయీద్, మసూద్‌ అజర్, జఖీర్‌ రహమాన్‌ లఖ్వీ లాంటి వారిని పట్టుకోవడం మాటలా?

నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. ఆయన ఏడాదిన్నరపాటు పాకిస్థాన్‌తో సత్సంబంధాలను కొనసాగించారు. నరేంద్ర మోదీ అనూహ్యంగా 2015, డిసెంబర్‌ 25వ తేదీన అప్పటి పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ సొంతూరు రాయ్‌విండ్‌కు వెళ్లి ఆయన్ని స్వయంగా కలుసుకొని  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మనమరాలి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు వారిరువురు యుఫాలో జరిగిన ‘షాంఘై సహకార సంఘం’ సమ్మేళనంలో కలుసుకున్నప్పుడు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య చర్చలకు అంగీకరించారు. గురుదాస్‌పూర్‌లో టెర్రరిస్ట్‌ దాడి జరగడంతో వారి సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికి ఆ ఇరువురు అధికారులు 2015, డిసెంబర్‌ నెలలో బ్యాంకాక్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. 

అంతకుముందు అంటే, 2014, నవంబర్‌ నెలలో నేపాల్‌లో జరిగిన సార్క్‌ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోదీ, నవాజ్‌ షరీఫ్‌లు రహస్యంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ బార్కాదత్‌ తన ‘ది అన్‌క్వైట్‌ ల్యాండ్‌’ పుస్తకం ద్వారా బయటపెట్టారు. ఇదంతా పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలను మెరగుపర్చుకొని తద్వారా టెర్రరిస్టు ముఠాలను అంతం చేయడం లక్ష్యం అనుకుంటే ఆ దిశగా కూడా మోదీ ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేక పోయింది. మోదీ హయాంలో జరిగిన పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి నుంచి మొన్నటి పుల్వామా ఉగ్ర ఆత్మాహుతి దాడి వరకు మూడేళ్ల సమయం దొరికినప్పటికీ మోదీ ప్రభుత్వం పాకిస్థాన్‌లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా సంస్థలనుగానీ, పాక్‌లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థాన్, ఇండియన్‌ ముజాహిదీన్‌ టెర్రరిస్టులను ఏమీ చేయలేకపోయింది. 

పాక్‌స్థాన్‌ సైనికుల చెర నుంచి భారత పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ విడుదలైన సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘అభీ అభీ ఏక్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ పూరా హోగయా, పైలేతో ప్రాక్టీస్‌ తీ, రియల్‌ ప్రాజెక్ట్‌ అబ్‌ ఆగే హై’ అని బాలకోట్‌లో జైషే మొహమ్మద్‌ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళం జరిపిన దాడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ దాడిపై అంతర్జాతీయంగా సవాలక్ష అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు జరగబోయే దాడి ఎలా ఉంటుందో! తెలియదు. మోదీ చేతల సంగతి పక్కన పెడితే ఆయన మాటలు మాత్రం చాలా బాగుంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement