
సాక్షి, న్యూఢిల్లీ: నిరుద్యోగం, దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అధిక ధరలు.. ఇన్ని సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని వృద్ధి బాటన పరుగులు పెట్టించడం ప్రధాని నరేంద్ర మోదీకి అతిపెద్ద సవాల్‌గా ముందుకొస్తున్నది. విపక్షాలు, విమర్శకుల నుంచి ఎదురయ్యే రాజకీయ దాడిని ఎదుర్కోవడమూ సంక్లిష్టమే. సార్వత్రిక ఎన్నికల ముందు ముంచుకొచ్చిన ఈ సవాళ్లను ఆయన ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సవాళ్లను స్వీకరిస్తూనే దేశ రూపురేఖలను మార్చేందుకు బృహత్తర పథకంగా భారీ రహదారుల నిర్మాణాన్ని మోదీ తలకెత్తుకున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులైన రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున పూనుకోవడంతో నిరుద్యోగ సమస్యకూ చెక్ పెట్టవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. 2022 నాటికి రూ 6.92 లక్షల కోట్లతో 83,677 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవడంతో పాటు దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 14.2 కోట్ల పనిదినాలను కల్పించనున్నాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి తరహాలో రహదారుల ద్వారా భారత్ ముఖచిత్రాన్ని మార్చివేయాలన్నది మోదీ సంకల్పంగా భావిస్తున్నారు. హైవేలు కేవలం రహదారులే కాదు అవి దేశ గతిని మార్చే భాగ్యరేఖలని గతంలో నాలుగు ప్రధాన నగరాలని కలిపే స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు చేపట్టిన సందర్బంగా వాజ్‌పేయి చెప్పిన మాటలను మోదీ సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.
మౌలిక రవాణా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధికి బాటలువేయాలన్న వాజ్‌పేయి ఆకాంక్షను మోదీ అందిపుచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక భారత్‌మాల పథకం కింద రాబోయే రోజుల్లో రూ. 5.35 లక్షల కోట్లతో హైవేలను అభివృద్ధి చేయనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టుకు మార్కెట్ రుణాలు, కేంద్ర రహదారి నిధులు, బడ్జెట్ కేటాయింపుల వంటి వనరుల ద్వారా నిధులు సమీకరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment