బీజేపీ చరిత్రాత్మక విజయం! | Narendra Modi tsunami washes away Congress, regional satraps in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

బీజేపీ చరిత్రాత్మక విజయం!

Published Sat, May 17 2014 1:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బీజేపీ చరిత్రాత్మక విజయం! - Sakshi

బీజేపీ చరిత్రాత్మక విజయం!

  •   సొంతంగా సంపూర్ణ మెజారిటీ.. 285 సీట్లతో ఘన విజయం
  •   చాలా రాష్ట్రాల్లో బీజేపీ స్వీప్... ఎన్‌డీఏ భాగస్వాములకూ ‘మిత్ర’లాభం
  •   కాంగ్రెస్‌కు ఘోర పరాభవం.. చరిత్రలో ఎరుగని రీతిలో పరాజయం
  •   44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్.. ప్రతిపక్ష హోదా కూడా దక్కని తీరు
  •   ఏడు రాష్ట్రాల్లో ఒక్క స్థానమూ దక్కించుకోలేకపోయిన వైనం
  •   మిత్రపక్షాలకు మరో 15 సీట్లు.. కాంగ్రెస్ సహా యూపీఏకు 59 మాత్రమే
  •   37 సీట్లతో మూడో స్థానంలో అన్నా డీఎంకే.. తృణమూల్‌కు 34 సీట్లు
  •   తర్వాతి స్థానాల్లో బీజేడీ, శివసేన, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఎం, వైఎస్సార్‌సీపీ
  •   చతికిలపడ్డ ఎస్‌పీ, జేడీయూ, డీఎంకే, ఎన్‌సీపీ.. ఖాతా తెరవని బీఎస్‌పీ
  •   మోడీ ప్రభంజనంలో వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ డీలా
  • నేను కూలీ నంబర్ 1. నేను పడనున్న కష్టాన్ని నా ప్రత్యర్థులు సహా ఎవరూ ప్రశ్నించలేరు. వచ్చే 60 నెలల పాటు నన్ను మించిన కార్మికుడిని మీరు చూడలేరు. దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత కాంగ్రెసేతర పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించడం ఇదే ప్రథమం. అలాగే, స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వ్యక్తి అధికార పగ్గాలు చేపట్టనుండటం కూడా ఇదే తొలిసారి. ప్రభుత్వాన్ని నడపడంలో అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు నాకు సహకరించాలని కోరుతున్నాను. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుస్తాను. దేశాభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తాను. - నరేంద్ర మోడీ
     
     సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో మోడీ ప్రభంజంనం పోటెత్తింది. నమో మంత్రం భారతీయ జనతా పార్టీకి మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ ఆధిక్యం కట్టబెట్టింది. నరేంద్రమోడీ మాయాజాలం నూటముప్పై ఏళ్ల కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ఎరుగనంతగా చావు దెబ్బతీసింది. ముప్పై ఏళ్ల కిందట రెండంటే రెండు లోక్‌సభ సీట్లతో మొదలైన కమలదళానికి ఈ ఎన్నికల్లో.. ‘ఈసారి.. మోడీ సర్కారు’ నినాదం 285 సీట్లు సాధించి పెట్టింది. స్వాతంత్య్రానంతర భారతదేశాన్ని యాభై ఏళ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 50 సీట్లు కూడా దక్కలేదు. ఒకప్పుడు 414 సీట్లతో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్.. నాడు జనతా పార్టీ హవాలోనూ 150 పైగా సీట్లతో బలమైన ఉనికిని కాపాడుకున్న కాంగ్రెస్.. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏనాడూ రెండంకెల స్థానాలకు దిగజారని కాంగ్రెస్.. నేడు మోడీ సునామీలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది.
     
    చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఓటమిని చవిచూసింది. కేవలం 44 సీట్లకే పరిమితమైపోయి నేలమట్టమయింది. నిన్నటివరకూ కొమ్ముకాచిన ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) వంటి రాష్ట్రాల్లో అసలు పూర్తిగా అదృశ్యమైపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ప్రాంతంలో లాభిస్తుందనుకున్న ఆ పార్టీ కలలూ కల్లలయ్యాయి. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కనీసం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కాంగ్రెస్‌తో సహా అధికార యూపీఏ భాగస్వామ్య పక్షాలకు 62 సీట్లు మాత్రమే లభించాయంటే.. యూపీఏ సర్కారుపై ప్రజా వ్యతిరేకత.. అదే సమయంలో మోడీ ప్రభంజనం ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతోంది. పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ముందుకు తీసుకువచ్చిన బీజేపీ.. దేశంలో సంపూర్ణ మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర రాజకీయ పార్టీగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. మూడు దశాబ్దాలుగా ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని సంకీర్ణ శకానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ముప్పై ఏళ్ల కిందట ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చివరిసారిగా సొంతంగా మెజారిటీ సాధించగా.. తిరిగి ఇప్పుడు బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించగలిగింది.
     
    ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిగా పోటీ చేసినా కూడా బీజేపీ సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దానికన్నా ఎక్కువ సీట్లు సాధించింది. నరేంద్రమోడీ భారతదేశ 14వ ప్రధానమంత్రిగా ఈ నెల 21వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బీజేపీ గెలుపు భారత్ గెలుపు అని, తమది భారతీయులందరి ప్రభుత్వమని ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ అభివర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని సంయుక్తంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఓటమికి తాము బాధ్యత వహిస్తున్నామని చెప్పారు. మోడీకి, బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్.. కాబోయే ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. 
     
     బీజేపీకే సంపూర్ణ మెజారిటీ...
     
     దేశంలో 16వ లోక్‌సభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 17.2 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో 55 కోట్ల ఓట్లను లెక్కించిన అధికార యంత్రాంగం.. ఉదయం నుంచీ ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వచ్చింది. ఆది నుంచీ బీజేపీ ప్రభంజనం, కాంగ్రెస్ పరాభవం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతూ వచ్చింది. లెక్కింపు మొదలైన రెండు గంటల్లోనే ఉదయం పది గంటలకే తుది ఫలితాల సరళి తేలిపోయింది. మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 సీట్లు అవసరం. బీజేపీ ఒక్కటే 285 సీట్లు గెలుచుకుని అధికారానికి దూసుకువెళ్లింది.
     
    ఎన్‌డీఏ కూటమిలోని మిత్రపక్షాలతో కలిపి 339 సీట్లు గెలుచుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది. 1998, 1999 ల్లో నాటి తమ పార్టీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికి అత్యంత ప్రజాదరణ ఉన్న సమయంలో సైతం కేవలం 182 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన బీజేపీ.. నేడు నరేంద్రమోడీ సునామీతో.. సంపూర్ణ ఆధిక్యమనే ముప్పయ్యేళ్ల కలను సాకారం చేసుకుంది. గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం భారీగా 12 శాతం మేర పెరగటంతో ఇది సాధ్యమైంది. 2009లో 18.8 శాతం ఓట్లతో 116 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 31 శాతం ఓట్లతో 285 సీట్లు గెలుచుకుంది. 
     
     రాష్ట్రాలకు రాష్ట్రాలు క్లీన్ స్వీప్...
     ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో బీజేపీ ఏకపక్షంగా సీట్లు సాధించింది. ఈశాన్య భారతదేశం, దక్షిణ భారత దేశంలోనూ బీజేపీ తన సత్తా చాటగలిగింది. దేశానికి గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో 72 సీట్లను కమలదళం సొంతం చేసుకుంది. అలాగే.. గుజరాత్ (26), రాజస్థాన్ (25), దేశ రాజధాని ఢిల్లీ (7), ఉత్తరాఖండ్ (5), హిమాచల్‌ప్రదేశ్ (4), గోవా (2)ల్లో అన్ని సీట్లనూ సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 29 సీట్లలో 27, జార్ఖండ్‌లో 14 సీట్లలో 13, బీహార్‌లో 40 సీట్లలో 23, ఛత్తీస్‌గఢ్‌లో 11 సీట్లలో 9, కర్ణాటకలో 28 సీట్లలో 17 సీట్లు సాధించింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న శివసేన, టీడీపీ, ఎల్‌జేపీ, తదితర పార్టీలు బాగా లాభపడ్డాయి. మహారాష్ట్రలో శివసేన 19 సీట్లు గెలుచుకుంది. ఇక్కడి 48 సీట్లలో బీజేపీ-శివసేన కూటమి 40 సీట్లు సొంతం చేసుకుంది. 
     
     కాంగ్రెస్‌కు ఘోరపరాభవం... 
     పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ, ఆ కూటమి సారథి కాంగ్రెస్ పార్టీ అత్యంత అవమానకరమైన రీతిలో నేలమట్టయ్యాయి. గత ఎన్నికల్లో 206 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించి సంకీర్ణ సర్కారును నిలుపుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 44 సీట్లు మాత్రమే దక్కాయి. ఏడు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. మోడీ హవాలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒక దశలో.. కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం.. అమేథీలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి అంచుల వరకూ వెళ్లటాన్ని బట్టి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
     
    2009లో కాంగ్రెస్‌కు 28.5 శాతం ఓట్లు లభించగా ఈ ఎన్నికల్లో అది పది శాతానికి పైగా తగ్గిపోయింది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే.. మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు తెచ్చుకోవాలి. కాంగ్రెస్‌కు ఆ సీట్లు కూడా రాకపోవటంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక కాంగ్రెస్ మిత్రపక్షాలైన యూపీఏ భాగస్వామ్య పక్షాలకు మరో 15 సీట్లు లభించాయి. దేశంలో అత్యధిక సీట్లు సాధించిన రెండో పార్టీగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. మూడో స్థానం దక్కించుకున్న ప్రాంతీయ పార్టీ ఏఐఏడీఎంకే కంటే అవి కేవలం 7 సీట్లు మాత్రమే అధికం. 
     
     మూడు ప్రాంతీయ పార్టీల జోరు...
     కమలదళం జైత్రయాత్రను తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే, పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు మాత్రమే నిలువరించగలిగాయి. అన్నా డీఎంకే 37 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీతో పాటు.. తృణమూల్ కాంగ్రెస్ 34 సీట్లు, బీజేడీ 18 సీట్లు గెలుచుకుని తమ తమ రాష్ట్రాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాయి. బీజేడీ, శివసేనల తర్వాత 16 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఏడో స్థానంలో నిలిచింది. ఈ పార్టీ కూడా బీజేపీతో పొత్తుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో లాభపడింది. ఆ తరువాతి స్థానాల్లో టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం నిలిచాయి.
     
     ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
     ఎన్‌డీఏ: బీజేపీ 285, మిత్రపక్షాల్లో శివసేన 18, టీడీపీ 16, ఎల్‌జేపీ 6, శిరోమణి అకాలీదళ్ 4, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 3, అప్నా దళ్ 2, ఇతరులు 5  - మొత్తం 339 సీట్లు
     
     యూపీఏ: కాంగ్రెస్ 44, మిత్రపక్షాల్లో ఎన్‌సీపీ 6, ఆర్‌జేడీ 4, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ 2, జేఎంఎం 2, కేరళ కాంగ్రెస్ ఎం 1 - మొత్తం 59 సీట్లు
     
     ఇతరులు: అన్నా డీఎంకే 37, తృణమూల్ కాంగ్రెస్ 34, బిజూ జనతాదళ్ 18, టీఆర్‌ఎస్ 11, సీపీఎం 9, వైఎస్సార్ కాంగ్రెస్ 8, సమాజ్‌వాది పార్టీ 5, ఆప్ 4, ఏఐయూడీఎఫ్ 3, పీడీపీ 3, జేడీ (యూ) 2, జేడీ (ఎస్) 2, ఐఎల్‌డీఎఫ్ 2, ఐఎన్‌ఎల్‌డీ 2, సీపీఐ 1, ఆర్‌ఎస్‌పీ 1, ఎంఐఎం 1, ఎస్‌డీఎఫ్ 1, స్వతంత్రులు 1 - మొత్తం 145 సీట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement