బాలరాముడు మళ్లీ టెంట్‌లోకే..
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ
బారాబంకీ/ఫతేపూర్/హమీర్‌పూర్: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్‌లోకి వెళ్లాల్సి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్లను ఎక్కడికి పంపించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పారీ్టలకు సూచించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో దశ పోలింగ్ జరుగుతున్నకొద్దీ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేకమేడలా కూలిపోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలకు, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు.
శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ, ఫతేపూర్, హమీర్‌పూర్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జూన్ 4వ తేదీ ఇక ఎంతోదూరంలో లేదని, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న సంగతి కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలుసని స్పష్టంచేశారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగాల్లోని విశేషాలివీ..
ఎన్నుకోవాల్సిన ఏకైక పార్టీ బీజేపీ
‘‘దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అంకితమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. మనకు మంచి చేసే ఎంపీలు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి.
కేవలం మోదీని దూషిస్తూ ఐదేళ్లు కాలం గడిపే ఎంపీలు మనకు అవసరమా? 100సీసీ ఇంజన్‌తో 1,000 సీసీ వేగం సాధ్యమా? బలమైన ప్రభుత్వమే అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదు. అలాంటి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. నిజంగా దేశ ప్రగతిని కోరుకుంటే మనం ఎన్నుకోవాల్సిన ఎకైక పార్టీ బీజేపీ.
అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ పెద్దలు అనుచితంగా మాట్లాడారు. రామాలయం విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తిరగదోడాలని కాంగ్రెస్ భావిస్తోంది. వారికి సొంత కుటుంబ ప్రయోజనాలు, రాజకీయ అధికారమే ముఖ్యం. కాంగ్రెస్–సమాజ్‌వాదీ పారీ్టలకు అధికారం అప్పగిస్తే అయోధ్యలో అలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారు. రామ్‌లల్లా మళ్లీ టెంట్‌లోకి పంపిస్తారు. ఆ రెండు పారీ్టలకు ఓటు బ్యాంకు కంటే ఏదీ ఎక్కువ కాదు.
రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేతలు దారుణంగా మాట్లాడుతున్నారు. మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకే ఇవ్వాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి(లాలూ ప్రసాద్ యాదవ్) అన్నారు. అంటే దళితులు, గిరిజనులు, ఓబీసీలకు అన్యాయం చేయాలా? వారు ఉన్నత స్థాయికి చేరుకోవద్దా?’’ అని మోదీ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment