మిగిలింది 24 గంటలే..! | NASA fails to locate Vikram lander due to long shadows over landing site | Sakshi
Sakshi News home page

మిగిలింది 24 గంటలే..!

Published Fri, Sep 20 2019 4:26 AM | Last Updated on Fri, Sep 20 2019 4:26 AM

NASA fails to locate Vikram lander due to long shadows over landing site - Sakshi

సాక్షి బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌–2 వాహకనౌకలోని ‘విక్రమ్‌’ ల్యాండర్‌పై ఆశలు అడుగంటుతున్నాయి. ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రోతోపాటు నాసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సెప్టెంబర్‌ 17న నాసాకు చెందిన లూనార్‌ రికానిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) విక్రమ్‌ పడిన ప్రాంతాన్ని ఫొటోలు తీసింది. వాటిల్లో విక్రమ్‌ జాడ దొరకలేదు. శుక్రవారంలోపు విక్రమ్‌ను గుర్తించకపోతే దానిపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చంద్రయాన్‌–2లో భాగంగా ఈ నెల 7న తెల్లవారుజామున చంద్రుడ్ని సమీపించిన ల్యాండర్‌ విక్రమ్‌ భూకేంద్రంతో సంబంధాలు కోల్పోవడంతో చంద్రుడిపై పడింది.

శాశ్వతంగా మూగబోతుంది..
‘విక్రమ్‌’తో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో అవిశ్రాంతంగా పనిచేస్తోంది. కానీ సెప్టెంబర్‌ 20లోపు ఈ ప్రయత్నం విజయవంతం కాకపోతే ల్యాండర్‌ నిరుపయోగంగా మారిపోతుందని చెబుతున్నారు. ఈ విషయమై ఇస్రో శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ..‘సాధారణంగా చంద్రుడిపై 14 రోజులు పగలు ఉంటే, మరో 14 రోజులు చీకటిగా ఉంటుంది. శుక్రవారంతో చంద్రుడిపై పగటి సమయం ముగుస్తుంది. అనంతరం జాబిల్లి చీకటిభాగంలో ఉష్ణోగ్రత మైనస్‌ 240 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోతుంది. ఈ శీతల వాతావరణాన్ని తట్టుకునేలా విక్రమ్, రోవర్‌ ప్రజ్ఞాన్‌ను మేం రూపొందించలేదు. కాబట్టి చలికి ఇవి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదముంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.

సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం: నాసా
విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించేందుకు లూనార్‌ రికానిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) ద్వారా తీసిన చిత్రాలను తాము పరిశీలిస్తున్నామని ఎల్‌ఆర్‌ఓ ప్రాజెక్టు డిప్యూటీ సైంటిస్ట్‌ జాన్‌ కెల్లర్‌ తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన పాత ఫొటోలను, తాజా ఫొటోలను పోల్చిచూడటం ద్వారా విక్రమ్‌ జాడను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. విక్రమ్‌ చంద్రుడిని ఢీకొట్టిన ప్రాంతంలో ఎత్తుపల్లాల కారణంగా భారీ నీడలు ఏర్పడ్డాయని, వెలుతురు కూడా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇస్రోతో జాబిల్లి సమాచారాన్ని, చిత్రాలను పంచుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement