(వెబ్ ప్రత్యేక కథనం)
న్యూఢిల్లీ: చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయినప్పుడు సైనికుల్లోనే కాకుండా దేశ ప్రజల్లో కూడా దేశభక్తిని ప్రోత్సహించాలని పలువురు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఆ సూచనలు అలాగే మిగిలిపోయాయి. 1965లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం ముగిశాక మళ్లీ ఈ అంశం చర్చకు వచ్చింది. అప్పుడు ప్రతి సినిమా థియేటర్లలో సినిమా ముగింపులో జాతీయ గీతాలాపనను వినిపించాలని, ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా నిలబడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోల్‌కతాలోని గ్రాంఫోన్ కంపెనీలో 78 ఆర్‌పీఎంలో జాతీయ గీతాన్ని రికార్డు చేయించి దేశంలోని అన్ని థియేటర్లకు పంపించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక నిమిషం వీడియోను కూడా రూపొందించి సినిమా థియేటర్లకు పంపించారు. తెరపై నలుపు, తెలుపు రంగుల్లో జాతీయ జెంగా రెప రెపలాడుతుండగా గీతాలాపన వినిపించేది. ఆ తర్వాత కొంతకాలానికి కలర్ వర్షన్ వచ్చింది. మొదట్లో ప్రేక్షకులు బుద్ధిగా లేచినలబడి గీతాలాపన ముగిసేవరకు అలాగే ఉండేవారు. రానురాను సినిమా ముగిసి గీతాలాపన ప్రారంభంకాగా ప్రేక్షకులు వెళ్లిపోవడం ప్రారంభమైంది. దాంతో 1980 దశకంలో థియేటర్లలో గీతాలాపనకు తెరదించారు. (జాతీయ గీతం ఎలా పుట్టింది?)
మళ్లీ మల్టీప్లెక్స్‌లు వచ్చాక.....
1990వ దశకంలో దేశంలోని మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్‌ల రావడంతో అధికారులకు జాతీయ గీతాలాపనను పునరుద్ధరించాలనే ఆలోచన వచ్చింది. అయినా ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. 2003లో మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపనను వినిపించాలని అప్పటి డిప్యూటి ముఖ్యమంత్రి ఛాగల్ భుజ్‌పల్ రాష్ర్టంలోని థియేటర్లను ఆదేశించారు. సినిమాకు ముందే గీతాలాపనను వినిపించినట్లయితే ప్రేక్షకులు బయటకు వెళ్లే అవకాశం ఉండదన్న ఆయన ఆలోచన దాదాపు సక్సెస్ అయింది. అంతేకాకుండా జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది. ఇలాంటి చట్టం ఇప్పుడు దేశంలో మహారాష్ట్ర, గోవాలో మాత్రమే అమల్లో ఉంది.
నాడు సోషల్ మీడియాలో హల్‌చల్
అందుకనే 2015, నవంబర్ నెలలో ముంబైలోని ఓ థియేటర్లో జాతీయ గీతాలాపన సందర్భంగా ఓ జంట సీట్ల నుంచి లేవనందుకు తోటి ప్రేక్షకుల ఆ జంటను థియేటర్ నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అమీషా పాటిల్‌ను కూడా ముంబై థియేటర్లలో ఇలాంటి సందర్భంలోనే ప్రేక్షకులు అవమానించారు. బాలివుడ్ నటి ప్రీతి జింటా కూడా 2014లో ముంబైలోని ఓ థియేటర్‌లో ఓ యువకుడు లేచి నిలబడనందుకు గోల చేసి థియేటర్ నుంచి బయటకు పంపించారు. గోవాలో ఇటీవల అంటే, అక్టోబర్ నెలలో ప్రముఖ రచయిత, దివ్యాంగుల హక్కుల కార్తకర్త సలీల్ చతుర్వేది జాతీయ గీతాలాపన సందర్భంగా థియేటర్లో లేచి నిలబడనందుకు ఆయన్ని ప్రేక్షకులు కొట్టారు. దివ్యాంగుడే కాకుండా వెన్నుముక దెబ్బతినడం వల్ల సలీల్ చతుర్వేది వీల్‌చేర్ నుంచి లేవలేకపోయారు.
మల్టీప్లెక్స్‌లో అపహాస్యం
వీటిల్లో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అపహాస్యం పాలైంది. వాణిజ్య ప్రకటనలన్నీ ముగిశాక ఈ గీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఎక్కువ మంది లేచి నిలబడుతున్నప్పటికీ వారి వద్ద ఒక చేతిలో పాప్ కార్న్, మరో చేతిలో కూల్ డ్రింక్ ఉంటోంది. వారు కార్న్, తింటూ కోల్ డ్రింక్ తాగుతూ తాపీగా నిలబడేవారు, తొందరగా కూర్చొనేవారు. ఇది కూడా నిబంధనలు ఉల్లంఘిచడం అవుతుందని భావించిన యువతరం టెక్నీషన్లు 2000 దశకంలో జాతీయ గీతానికి కోరస్ ఇచ్చే కొత్త వీడియో వర్షన్ తీసుకొచ్చారు. అందులో జాతీయ జెండాలో ఉండే అసలు రంగులను కొద్దిగా మార్చి డిజిటల్ జెండాను తీసుకొచ్చారు. ఈ వర్షన్ ప్రేక్షకులను నిలబెడుతుందని, నిలబడకపోయినా జెండాను, గీతాన్ని అవమానించినట్లు కాదని టెక్నీషయన్లు థియేటర్ యజమానులు భావించారు. ఇదే వర్షన్ ఆ తర్వాత దేశంలోని పలు పాఠశాలలు అడాప్ట్ చేసుకున్నాయి.
రెహమాన్ రంగప్రవేశం
2000 దశకంలోనే పండిట్ జస్రాజ్ మ్యూజిక్ మాయిస్ట్రో రెహమాన్‌తో కలసి కొత్త బాణీతో జాతీయ గీతం వీడియోను చిత్రీకరించనున్నట్లు ప్రకటించారు. నిమిషానికి బదులు జాతీయ గీతం రెండు నిమిషాలు ఉంటుందని వెల్లడించారు. పండిట్ భీంసేన్ జోషి, లతా మంగేష్కర్ లాంటి 50 మంది మహా మహా గాయణీ గాయకులు, సంగీత విద్వాంసులతో రిహార్సల్స్ కూడా ప్రారంభించారు. అయితే ఇది జాతీయ గీతం కోడ్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారులు, కొన్ని దేశభక్తి సంఘాలు గోల చేశాయి. దాంతో ఈ వీడియో రికార్డు ఆగిపోయింది.
సోని మ్యూజిక్‌తో కలిసి...
ఆ తర్వాత రెహమాన్ సోని మ్యూజిక్ కంపెనీ, భారత్ బాల ప్రొడక్షన్‌తో కలిసి జాతీయ గీతంపై 150 సెకండ్లతో వీడియోను తీసుకొచ్చారు. ఇందులో రెహమాన్, లతా మంగేష్కర్‌తోపాటు ఆశాభోంస్లే, క వితా కృష్ణమూర్తి నుంచి డీకె పట్టమ్మాల్ వరకు, పండిట్ భీంసేన్ జోషి నుంచి జస్రాజ్ వరకు, హరిప్రసాద్ చౌరాసియా, నుంచి అమ్జత్ అలీ ఖాన్ వరకు ఎందరో మహానుభావులైన విద్వాంసులు పాల్గొన్నారు. ఈ వీడియో కూడా జాతీయ గీతం కోడ్‌కు విరుద్ధంగా ఉండడంతో అధికారిక గుర్తింపు రాలేదు. టీవీలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత మరాఠీ థియేటర్‌కు చెందిన టెలివిజన్ పర్సనాలిటీ పుష్కర్ స్త్రోత్రి ప్రభుత్వ పెద్దల సహకారంతో 40 మంది విద్వాంసులతో, మరాఠి నటీనటులతో రూపొందించిన జాతీయ గీతం కొత్త వర్షన్‌ను 2007, ఆగస్టు 15 తేదీ నుంచి మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శిస్తూ వస్తున్నారు.
చట్టంలో నిలబడాలని లేదు....
1971లో జాతీయ జెండాను, గీతాన్ని గౌరవించేందుకు తెచ్చిన ‘ప్రొటెక్సన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్’లో స్పష్టత లేదు. జాతీయ జెండాను, గీతాన్ని అగౌరవ పరిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఉందిగానీ గీతాలాపన సందర్భంగా నిలబడకపోవడం కూడా నేరమని లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరిగా వినిపించాలని, ఆ సందర్భంగా ప్రేక్షకులు గౌరవ సూచకంగా నిలబడాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
థియేటర్లలోకి జాతీయగీతం ఎప్పుడొచ్చింది?
Published Fri, Dec 2 2016 9:23 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM
Advertisement