గుండెల్లో దేశభక్తి చాలదా?
దేశవ్యాప్తంగా ప్రతి సినిమా హాలులో ప్రదర్శనకంటే ముందు జాతీయ గీతం ఆల పించాలనీ, ప్రేక్షకులంతా విధిగా 52 సెకన్లు నిలబడి జాతీయ గీతాన్ని పూర్తిగా పాడాలనీ, ఆ సమయంలో తెరపైన జాతీయ పతాకం ప్రదర్శించాలనీ, ప్రేక్షకులు నిష్ర్కమించే అవకాశం లేకుండా ద్వారాలు మూసి ఉంచాలనీ సుప్రీంకోర్టు ధర్మా సనం బుధవారం తాత్కాలిక ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమై వాడివేడి చర్చకు దారి తీసింది. దేశభక్తిపైనా, జాతీయతపైనా జస్టిస్ దీపాంకర్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకూ, ప్రధాని నరేంద్రమోదీ రెండున్నర సంవత్సరాలుగా వెలిబుచ్చుతున్న అభిప్రాయాలకూ మధ్య కనిపిస్తున్న అభేదం ఆశ్చర్యం కలిగించకమానదు. మాతృ మూర్తినీ, మాతృదేశాన్నీ, మాతృభాషనూ ప్రేమించాలని బాధ్యతాయుతులైన పౌరులకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అది జాతి సంస్కారంలో భాగంగా సంక్రమించే విలువ. దేశాన్నీ, తల్లినీ ప్రేమించడం వ్యక్తిగత విషయం. ఆ ప్రేమకు కొలమానం ఉండదు. చట్టాల ద్వారా దేశభక్తిని కానీ మాతృభక్తిని కానీ పౌరులలో పాదుకొల్పడం అసాధ్యం.
న్యాయమూర్తులు మానవమాత్రులు. వారిపైన దేశ కాల పరిస్థితుల ప్రభావం నిశ్చయంగా ఉంటుంది. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రస్తుతానికీ, జస్టిస్ చిన్నప్పరెడ్డి అదే న్యాయస్థానంలో పనిచేసిన గతానికీ మధ్య చాలా అంతరం ఉంది. కేరళ విద్యార్థుల కేసులో జాతీయగీతాన్ని పాడాలని పట్టు బట్టడం భావప్రకటన స్వేచ్ఛకు గండికొట్టడమేనంటూ చిన్నప్పరెడ్డి తీర్పు ఇచ్చారు. భావప్రకటన స్వేచ్ఛ ప్రసాదించిన రాజ్యాంగమే మౌనంగా ఉండే స్వేచ్ఛ ఇచ్చిం దంటూ ఆయన అన్వయించారు. జాతీయ గీతం రచించిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అభిప్రాయాలకీ, అదే గీతంపైన ఇప్పుడు ఆదేశాలు జారీ చేసిన న్యాయ మూర్తుల భావాలకూ మధ్య గణనీయమైన అంతరం ఉంది. టాగోర్ తనను తాను విశ్వమానవుడుగా సంభావించుకునేవారు. ఆయన దేశభక్తుడు నిస్సందేహంగా. కానీ జాతీయతాభావాన్ని పనికట్టుకొని ప్రదర్శించడాన్ని ఆమోదించే వ్యక్తి మాత్రం కాడు.
కవిగా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుకున్న మేధావి. స్వాతంత్య్ర దినోత్స వాలు, రిపబ్లిక్ డే వేడుకలలో జాతీయగీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. 1962లో చైనా దురాక్రమణ తర్వాత సినిమా ప్రదర్శన చివరిలో జాతీయగీతాలాపన ప్రవేశ పెట్టారు. 1971 జాతీయ పతాకంపట్ల గౌరవాన్ని పరిరక్షించేందుకు ఒక చట్టాన్ని తెచ్చారు. జాతీయగీతాలాపన జరుగుతుండగానే ప్రేక్షకులు నిష్ర్కమించడం జాతీ యగీతాన్ని అవమానించడంగా భావించి 1975 నుంచి ఆ ఆనవాయితీకి స్వస్తి చెప్పారు. ఎవ్వరూ ఎవరి దేశభక్తినీ శంకించలేదు. ప్రశ్నించలేదు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారాయి. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోనూ 207 అడుగుల ఎత్తున జాతీ యపతాకం రెపరెపలాడుతూ ఉండాలని స్మృతిఇరానీ అధ్యక్షతన జరిగిన వైస్‌చాన్సలర్ల సమావేశం తీర్మానించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపైన మెరుపు దాడుల సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం జాతి వ్యతిరేక చర్యగా భావించే పరిస్థితులు దాపురించాయంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.
ఇప్పటికీ సినిమాహాళ్ళలో జాతీయగీతాలాపన జరుగుతున్న రాష్ట్రాలలో మహా రాష్ట్ర, గోవా ఉన్నాయి. అక్టోబరులో గోవాలోని ఒక సినిమాహాలులో జాతీయగీతం పాడుతున్న సందర్భంలో ప్రముఖ రచయిత సలీల్‌చతుర్వేది తన సీట్లోనే కూర్చొని ఉన్నారు. ఆ దృశ్యాన్ని సహించలేని దేశభక్తులైన దంపతులు ఆయనపైన దాడి చేశారు. ఆ రచయితకు ప్రమావశాత్తూ వెన్నెముక గాయమైనదనీ, నిలబడలేనిస్థితి లో ఉన్నారనీ, వికలాంగుల హక్కుల సాధన ఉద్యమంలో ఆయన ప్రముఖుడనీ ఆ దంపతులకు తెలియదు. ఇటువంటి ఘటనలు మొన్నటి తీర్పు ప్రభావంతో ముమ్మరం కావచ్చుననే ఆందోళన ఆలోచనాపరులను అశాంతికి గురిచేస్తున్నది.
మనం అన్ని విషయాలలో పాశ్చాత్యదేశాలను, ముఖ్యంగా అమెరికాను, ఆద ర్శంగా తీసుకుంటున్నాం. అమెరికా, బ్రిటన్‌వలె నగదు లావాదేవీలు లేని సమాజం నిర్మించాలన్న అభిలాషతోనే మోదీ పెద్దనోట్లను రద్దు చేశారని భావిస్తున్నాం. అదే అమెరికాలో జాతీయపతాకాన్ని తగులబెట్టడం శిక్షార్హమైన నేరం కాదు. మితవాద మనోభావాలకు ప్రతీక అయిన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ట్వీట్‌లో ‘అమెరికా పతాకాన్ని తగులబెట్టినవారికి కనీసం ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనను అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించే అవకాశాలు లేవు. వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శకులు అమెరికా జాతీయ పతా కాన్ని దగ్ధం చేసినప్పుడు ‘సమాఖ్య పతాక పరిరక్షణ చట్టాన్ని (ఫెడరల్ ఫ్లాగ్ ప్రొటె క్షన్ యాక్ట్) 1968లో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) తెచ్చింది. అదే చట్టాన్ని అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ 48 రాష్ట్రాలు ఆమోదించాయి. కానీ 1989లో అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ చట్టం రాజ్యాంగ విరు ద్ధమంటూ 5-4 మెజారిటీతో కొట్టివేసింది (టెక్సస్ వర్సెస్ జాన్సన్ కేసు).
అమె రికా రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణలో హామీ ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛకు ఈ చట్టం విఘాతం కలిగిస్తుందని తీర్పు చెప్పింది. పట్టువీడని అమెరికా కాంగ్రెస్ మరోసారి జాతీయపతాక పరిరక్షణ చట్టాన్ని ఆమోదించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 1990లో అదే 5-4 మెజారిటీతో కాంగ్రెస్ తాజా నిర్ణయాన్ని సైతం చెల్లదని ప్రకటించింది (యూఎస్ వర్సెస్ ఏక్మన్ కేసు). రిపబ్లికన్ పార్టీకి పార్లమెం టులో ఆధిక్యం ఉన్నది కనుక ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ఆలో చనను అమలు చేయవచ్చు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ.
పౌరులు మానవత్వం కలిగి ఉండాలనీ, తోటివారిని ప్రేమించాలనీ కోరుకో వాలి. దేశభక్తి గుండెనిండా ఉంటే చాలు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు 28 సంవత్సరాల తర్వాత తొలి స్వర్ణపతకాన్ని అభినవ్ భింద్రా సాధించినప్పుడు భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే, జాతీయ గీతం ఆలపిస్తుంటే హృదయం ఆనందంతో ఉప్పొంగని భారతీయులు ఎవరుంటారు? అదే సహజ మైన, సార్వజనీనమైన దేశభక్తి. జాతికి అదే రక్ష.