2018.. కేరళను ముంచెత్తిన వరదలు | National Issues 2018 Flashback | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 27 2018 4:47 PM | Last Updated on Fri, Dec 28 2018 2:54 PM

National Issues 2018 Flashback - Sakshi

2018 ఆరంభంలో చప్పగా సాగినప్పటికీ చివరికొచ్చే సరికి దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. పలు రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికలు, 2019 సంవత్సరం అత్యంత ఆసక్తికర సన్నివేశాలకు శ్రీకారం చుట్టనుంది. సీబీఐలో జగడం, సుప్రీం జడ్జీల మధ్య వివాదం... పలు రాష్ట్రాల్లో ప్రజా తీర్పులు... 2018 ని ఒక్కసారి తరిచి చూస్తే.... (సాక్షి రౌండప్)

థియేటర్లలో జాతీయ గీతం
(జనవరి 9) సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్ర ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30 న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.

సుప్రీంకోర్టులో సంక్షోభం
(జనవరి 12) దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నలుగురు సీనియర్‌ న్యాయముర్తులు మీడియా ముందుకు వచ్చారు. సీజేఐ తీరును ఆక్షేపిస్తూ సీనియర్‌ జడ్జిలు జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. కొద్ది నెలలుగా కోర్టు పాలన వ్యవస్థలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సంధించిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కీలక కేసుల కేటాయింపుల విషయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై ఆరోపణలు సంధించారు.

కావేరీ జలాలపై కీలక తీర్పు
(ఫిబ్రవరి 16) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ‌(సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఇచ్చింది.

కమల్‌ హాసన్‌ కొత్త పార్టీ
(ఫిబ్రవరి 21) ప్రఖ్యాత హీరో కమల్‌ హాసన్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మధురైలో తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కల్‌ నీది మయ్యం’ (ప్రజా న్యాయ వేదిక) పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు ప్రకటించి ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం
(మార్చి09) సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విప్లవ్‌ కుమార్‌ (48) ప్రమాణం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 35 స్థానాలు గెలుచుకుని సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం సంపాదించుకుంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) 8 సీట్లు గెలుచుకుంది. సీపీఎం కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

39 మందిని చంపిన ఉగ్రవాదులు
(మార్చి 20) ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం( జూన్‌ 15, 2014) ఐఎస్‌ ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది మరణించారని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్‌ పట్టణ సమీపంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రకటించారు.

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు
(ఏప్రిల్ ‌5) కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ ‌(52)కు ఐదేళ్లు జైలు శిక్ష పడింది. సల్మాన్‌ను దోషిగా నిర్దారిస్తూ జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. హమ్‌ సాథ్‌ హై షూటింగ్‌ సమయంలో (1998) రాజస్తాన్‌లోని కంకిణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్‌ కాల్చి చంపారని కేసు నమోదైంది.

కర్ణాటకలో కొలువుతీరిన సంకీర్ణం
(మే 15) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 78 స్ధానాలను హస్తగతం చేసుకోగా, జేడీఎస్‌ 37 స్ధానాల్లో గెలుపొందింది. అయితే జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడటంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది.

స్టెరిలైట్‌ ఆందోళనలు హింసాత్మకం
(మే 23) స్టెరిలైట్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో వంద రోజుల పాటు సాగిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తూత్తుకుడి ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా, 60 మందికి గాయాలయ్యాయి. 

దుమ్ము తుపాన్‌తో 17 మంది మృతి
(జూన్ -3) యూపీలో చెలరేగిన దుమ్ము తుఫానులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపాన్ దాటికి 24 గంటల్లోనే 13 మంది చనిపోయారు. సీతాపూర్ జిల్లాలో ఆరుగురు, గొండాలో ముగ్గురు, కౌశాంబిలో ఇద్దరు చనిపోగా, ఫైజాబాద్, హర్డొయ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీని ప్రభావంతో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.

లోయలో బస్పులో... 48 మంది మృతి
(జూలై 1) ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో అదుపుతప్పిన ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోయలో పడటంతో  48 మంది మరణించారు. 28 సీట్లుండే బస్సులో 58 మంది ప్రయాణించడంతో ప్రమాదం సంభవించింది.

సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
(జూలై 18) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయ్యప్ప ఆలయంలో మహిళలు కూడా పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును పలు రాజకీయ పార్టీలు, మహిళా, ప్రజా సంఘాలు స్వాగతించగా.. సంప్రదాయవాదులు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు.

కరుణానిధి అస్తమయం
(ఆగస్ట్ 7) డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి (94) మరణంతో యావత్‌ తమిళనాడు శోకసంద్రంలో మునిగింది. ద్రవిడ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన దిగ్గజం సెలవంటూ అనంతలోకాలకు తరలింది. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన కరుణానిధికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.

కేరళను కుదిపిన భారీ వర్షాలు
(ఆగస్ట్ ‌8) కేరళను భారీ వర్షాలు కుదిపివేశాయి. తీరప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 26 మంది మరణించారు. వరద తాకిడికి 24 డ్యాముల గేట్లు ఎత్తివేశారు. కనీవినీ ఎరుగని వరదలతో 26 ఏళ్ల తర్వాత  చెరుతోని డ్యాం గేట్లు తెరుచుకున్నాయి.

వాజ్‌పేయి కన్నుమూత
(ఆగస్టు 16) మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత అటల్‌ బీహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి మరణంతో యావత్‌దేశం శోకసంద్రంలో మునిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు వారం రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించాయి.

స్వలింగ సంపర్కం నేరం కాదు
(సెప్టెంబర్ 6) స్పలింగ సంపర్కం ఇక నేరం కాదని సెక్షన్‌ 377పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సెక్షన్‌ 377తో సమానత్వపు హక్కుకు విఘాతమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. మేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో  శృంగారం చేసుకోవడం నేరం కాదని పేర్కొంది.

సీబీఐలో జగడం
(అక్టోబర్‌‌ 24) సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలపై కేంద్రం వేటు వేసింది. కీచులాటలతో దర్యాప్తు ఏజెన్సీని దిగజార్చినందుకు సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అధికారాలకు కత్తెర వేసి ఆయనను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది.

అయోధ్య వివాదంపై విచారణ..!!
(అక్టోబర్‌ 29) అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2019 జనవరిలో తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ కేసు విచారణ తేదీలను ఖరారు చేస్తుందని తెలిపింది.

పటేల్‌ విగ్రహావిష్కరణ
(అక్టోబర్‌ 31) భారత తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ 143 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల (597అడుగులు) పటేల్‌ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్‌ నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యాంక్‌ సమీపంలో సాధజెట్‌ అనే దీవిలో ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ అని నామకరణం చేశారు. 

శబరిమల తీర్పు నిలిపివేతకు నో
(నవంబర్‌ 13) శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పుపై  స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రివ్యూ పిటిషన్లు జనవరి 22న విచారిస్తామని పేర్కొంది.

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ రద్దు
(నవంబర్‌ 21) జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీడీపీ - కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు

సెమీఫైనల్స్‌లో సత్తా చాటిన కాంగ్రెస్‌
(డిసెంబర్‌ 11) సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా పరిగణించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టగా, మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పాలక బీజేపీకి భంగపాటు ఎదురైంది. కీలక హిందీ రాష్ట్రాల్లో పట్టుసాధించిన కాంగ్రెస్‌ మూడు చోట్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 

రాష్ట్రపతి పాలన షురూ..
(డిసెంబర్‌ 20) డిసెంబర్ 19 అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. జూన్‌లో విధించిన గవర్నర్ పాలన డిసెంబర్‌ 19తో ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీనికి కేంద్ర మంత్రివర్గంతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement