బీజేపీ సభ్యత్వానికి సిద్ధూ రాజీనామా..!
న్యూఢిల్లీః గత రెండు నెలలుగా నలుగుతున్నవివాదానికి నేటితో తెర పడింది. బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు ఎట్టకేలకు బీజేపీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. జూలైలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారంటూ వచ్చిన వార్తలకు స్వస్తి పలుకుతూ.. వారం క్రితం సొంతగా ఆవాజ్-ఇ-పంజాబ్ పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే.
రాజకీయ నాయకుడుగా మారిన క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు బుధవారం ఢిల్లీలో తన బీజేపీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు ఛత్తీస్ గఢ్ లో వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ సభ్యురాలుగా కొనసాగుతున్న ఆమె.. సిద్ధు పార్టీ స్థాపన అనంతరం తానూ బీజేపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. 52 ఏళ్ళ నవజోత్ సింగ్ సిద్ధు గతవారం తాను కొత్త పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో.. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారు. అన్నదానికల్లా తల ఊపేవారికే కేజ్రీవాల్ తన పార్టీలో చోటిస్తారన్నారు. అంతేకాక తనను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో పోటీ చేయద్దని ఆయన కోరినట్లు తెలిపారు.
ప్రస్తుతం స్థాపించనున్న తన కొత్త పార్టీకి పంజాబ్ లో సిద్ధూనే ముఖ్యమంత్రి అభ్యర్థి కానుండటంతోపాటు.. తనతో కలసి నడిచేవారికి ఆహ్వానం కూడా పలుకుతున్నారు. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీనే కాక, కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరిందర్ సింగ్ కూడా తమ పార్టీలోకి రమ్మంటూ అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. 12 ఏళ్ళపాటు బీజేపీలో కొనసాగిన సిద్ధూ.. జూలై నెల్లో రాజ్యసభ నామినేటెడ్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీకి నోటీసులు అందించారు. 2014 పార్లమెంటరీ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అభ్యంతరం తెలిపిన అనంతరం.. సిద్ధూ పార్టీలో అన్యమనస్కంగానే కొనసాగుతున్నారు. అయితే బీజేపీ సభ్యులు మాత్రం సిద్ధూ నిర్ణయం పార్టీకి వెన్నుపోటు చర్యగా అభివర్ణిస్తున్నారు.