144 సీట్లు అడగటం న్యాయమే | NCP's demand for 144 seats justified: Ajit Pawar | Sakshi
Sakshi News home page

144 సీట్లు అడగటం న్యాయమే

Published Thu, Sep 18 2014 11:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

144 సీట్లు అడగటం న్యాయమే - Sakshi

144 సీట్లు అడగటం న్యాయమే

తప్పులు పునరావృతం కానివ్వం : ఎన్సీపీ నేత అజిత్ పవార్
ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సమానంగా సగం సీట్లలో పోటీ చేయాలన్న తమ డిమాండ్ న్యాయమేనని ఎన్సీపీ నాయకుడు, ఉప ముఖ్యమ్రంతి అజిత్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్సీపీ ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తే గతంలో చేసిన తప్పులను పునరావృతం కనీయబోమని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. 2004 అసెంబ్లీ  ఎన్నికల్లో 71 సీట్లు గెలచుకున్న ఎన్సీపీ ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. కానీ పొత్తు ధర్మాన్ని పాటించి కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి పదవిని వదులుకుంది.

అందుకు బదులుగా అదనంగా రెండు కేబినెట్ మంత్రులు, మూడు సహాయ మ్రంతుల పదవులను పొందగలిగింది. ఈ ఎన్నికల్లో తాము 144 సీట్లు కోరడం సబబేనని పవార్ అన్నారు. ఇంతకుముందు పూర్వ ఎన్నికల ఫలితాల ఆధారంగా సీట్ల పంపకాలు జరిగేవని చెప్పారు. ఆ విధంగా మొన్నటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి తాము సమాన స్థాయిలో సీట్లను కోరడం న్యాయమేనని అన్నారు. తమ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించిందని, అయితే శరద్‌పవార్, సోనియా గాంధీ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
తాము అధికారంలోకి వస్తే టోల్ వసూళ్లను రద్దు చేస్తామని అజిత్ పవార్ చెప్పారు. ఖార్‌గర్ టోల్ ప్లాజా సమస్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ బీజేపీలో చేరడంపై పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 40 శాతం జనాభా ముంబై వచ్చేందుకు ఖార్‌గర్‌ను దాటవలసి ఉంటుందని చెప్పారు. తానుకూడా అక్కడ టోల్ వసూళ్లను రద్దు చేయాలని కోరానని, కానీ సిడ్కో, ఎంఎంఆర్‌డీఏలు ప్రభుత్వానికి రూ.1,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అది పెద్ద మొత్తం కాకపోయినప్పటికీ ముఖ్యమంత్రి అందుకు అంగీకరించలేదని చెప్పారు.
 
పవార్ పిలిచారు: ఆర్పీఐ నేత ఆఠవలే
ముంబై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పనిచేమయమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆహ్వానించినట్లు ఆర్పీఐ నాయకుడు రాందాస్ ఆఠవలే తెలిపారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని వీడి తమతో కలిసి పోటీచేయాలని తనను శరద్ పవార్ కోరారన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఒక కొలిక్కి రానందున  ఆలోచించుకుని తమతో చేతులు కలిపేందుకు ఆలోచించమన్నారని ఆఠవలే తెలిపారు. అయితే తనకు మహాకూటమిని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశానన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సమస్య ఉన్నా తమకు కనీసం 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ, శివసేనఅంగీకరిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మహాకూటమిలోని పార్టీలు ఐక్యంగా పోరాడితే ఈసారి రాష్ర్టంలో తమదే అధికారమని ఆయన నొక్కిచెప్పారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు సమస్య తీరిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయమై ఎన్సీపీ రాష్ర్ట అధ్యక్షుడు సునీల్ తత్కరేను ప్రశ్నించగా రాందాస్‌తో పవార్ మాట్లాడినట్లు తమకు సమాచారం లేదన్నారు.
 
రాఖీసావంత్ చేరికతో పెరిగిన బలం
రాఖీ సావంత్ తమ పార్టీలో చేరడంవల్ల యువత సంఖ్య గణనీయంగా పెరిగిందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. ఆయన గురువారం ఒక టీవీచానల్ కొద్ది సేపు మాట్లాడారు. రాఖీ సావంత్ ఆర్పీఐలో చేరడాన్ని ఆఠవలే సమర్ధించారు. ఆమె తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదల కోసం పనిచేయాలని ఉందని, అది ఆర్పీఐ వల్ల సాధ్యమవుతుందని ఆమె భావించినందునే తమ పార్టీలో చేరిందని వివరించారు.
 కాగా, ఆమె రాకవల్ల పార్టీలోని మహిళ ఆఘాడి సభ్యులు కొంత నిరాశకు గురైనట్లు వచ్చిన వార్తలు నిజమేనని, అయితే తర్వాత అన్నీ సర్దుకున్నాయని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement