ఢిల్లీలో తివారీకి పుష్పగుచ్ఛమిస్తున్న అమిత్‌షా
• ఎస్పీ అభ్యర్థుల తుది జాబితా సిద్ధం
• బీజేపీకి ఎన్డీ తివారీ మద్దతు
లక్నో/సాక్షి న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్నకొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. తొలి విడతకు నామినేషన్ల పర్వం మొదలవటంతో.. అధికార సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల ఎంపిక పక్రియను పూర్తిచేసింది. దాదాపు 6గంటలపాటు సన్నిహితులతో చర్చించిన అఖిలేశ్.. తుది జాబితాను రూపొందించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తులు ఖరారు చేయాల్సి ఉండడంతో పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 50 మందికి పైగా టికెట్లు లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయం కూడా తుదిఅంకానికి చేరినట్లు తెలిసింది. గురు, శుక్రవారాల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చని ఎస్పీ వర్గాలు తెలిపాయి. ‘అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. కాంగ్రెస్‌తో పొత్తును దృష్టిలో పెట్టుకుని సీట్లపై తుది నిర్ణయం వెలువడుతుంది.
మరోసారి అఖిలేశ్‌ను యూపీ సీఎం చేయాలని మేం కృతనిశ్చయంతో ఉన్నాం’ అని ఎస్పీ ఎమ్మెల్సీ ఆనంద్ భదూరియా తెలిపారు. పార్టీ విజయంకోసం శ్రమించాలని ములాయం చెప్పారని భదూరియా వెల్లడించారు. అయితే ములాయం సూచించిన 38 మంది అభ్యర్ధుల జాబితాలో 28 మందికి సీట్లు ఇచ్చేందుకు అఖిలేశ్ అంగీకరించారని.. అయితే.. కొన్ని పేర్లపై (నేరచరిత ఉన్నవారిపై) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు, ఎస్పీ టికెట్ ఆశిస్తున్న వారంతా తెల్లవారుజామునుంచే చలికి లెక్కచేయకుండా అఖిలేశ్ ఇంటిముందు గుమిగూడారు. కాగా, ఎస్పీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ బుధవారం సీఎంతో సమావేశమయ్యారు.
కాగా, రెండుమూడు రోజుల్లో రాజకీయ పరిణామాలు మారొచ్చని లోక్‌దళ్ పార్టీ అభిప్రాయపడుతోంది. ‘కొడుకుచేతిలో అవమానానికి గురైన ములాయం ఆలోచనలో మార్పు రావొచ్చు. మా పార్టీ పేరుతో ఆయన తన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో దిగుతారని ఆశిస్తున్నాం’ అని లోక్‌దళ్ జాతీయాధ్యక్షుడు సునీల్ సింగ్ తెలిపారు. కాగా, ములాయం సూచించిన జాబితాలో అఖిలేశ్ ఆమోదముద్ర పొందని నేతలంతా లోక్‌దళ్ పేరుతో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పార్టీ టికెట్ దక్కలేదన్న నిరాశతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే శివసింగ్ ఎస్పీని ఆశ్రయించారు.
అమిత్ షాతో తివారీ భేటీ
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం నారాయణ్ దత్ తివారీ (91) బుధవారం బీజేపీ చీఫ్ అమిత్‌షాతో భేటీ అయ్యారు. దశాబ్దకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న తివారీ.. 2నెలలుగా తనయుడికి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ దక్కే అవకాశాలు కనిపించకపోవటంతోనే బీజేపీని ఆశ్రయించారు. దీంతో ప్రస్తుత సీఎం హరీశ్ రావత్ మినహా.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎంలైన వారంతా బీజేపీతోనే ఉన్నట్లు అవుతుంది. అయితే ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలుండటంతో ఏ చాన్స్‌ను బీజేపీ వదులుకోవటం లేదు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత యశ్‌పాల్ ఆర్య కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. తన తనయుడికి ఎమ్మెల్యేS టికెట్ ఖరారు చేసుకోడానికే యశ్‌పాల్ తమ పార్టీలో చేరారని బీజేపీ నేతలు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ విడుదల చేసిన 64 మంది జాబితాలో 10 మంది మాజీ కాంగ్రెస్ నేతలే.