సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులో రూ.1.5 కోట్ల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. రూ.1.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు సంబంధించిన పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలే నియంత్రించే విధంగా వెసులుబాటు క ల్పించాలని ఈ సమావేశంలో కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న కొన్ని గూడ్స్, సర్వీస్ ట్యాక్స్‌లను కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని కోరామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి.. ప్రజలకు మేలు చేసే సంకల్పంతో పనిచేయాలని సూచించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణకు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) పరిహారం కింద రూ, 10,440 కోట్ల నిధులు అందాల్సి ఉందని, వాటిని తక్షణమే విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. రాష్ట్రాల్లో కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తి మీద వివిధసంస్థలకు రాయితీలు ఇస్తున్నామని, జీఎస్టీ అమలు తరువాత ఈ రాయితీల విషయంలో నిధుల భారాన్ని రాష్ట్రాలు భరించాలా లేక, కేంద్రం భరించాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉందని ఈటల పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఇంకా అనేక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని ఈటల చెప్పారు.
'రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్నవారిని అక్కడే ఉంచాలి'
Published Sat, Oct 1 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement
Advertisement