న్యూఢిల్లీ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హతా పరీక్ష నీట్ ఆర్డినెన్స్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత పిటిషన్ను విచారించలేమని న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఇప్పుడు విచారణ చేపడితే విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీట్పై రెండు రోజుల క్రితమే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. నీట్ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆయా రాష్ట్రాలు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సొంతంగా పరీక్షలు నిర్వహించుకోనున్నాయి.
కాగా నీట్పై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ సంకల్స్ చటర్జీ ట్రస్ట్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, దీని వల్ల వైద్య విద్యలో సంస్కరణలు నిలిచిపోయే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అమిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ... న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై కార్యనిర్వాహక శాఖ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకి తెలిపారు. కాగా తమిళనాడు సీఎం జయలలిత తమ రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించమని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
నీట్ ఆర్డినెన్స్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
Published Fri, May 27 2016 11:17 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Advertisement