మహా పర్వతంపై మంచు చరియలు విరిగిపడి 22 మంది మృతి
⇒ 60 మందికి గాయాలు.. సహాయం కోసం వందల మంది నిరీక్షణ
⇒ ఆదివారం నాటి భూ ప్రకంపనలతో మళ్లీ కూలిన మంచుదిబ్బలు
కఠ్మాండు: భూగోళంపై మహా పర్వతమైన ఎవరెస్ట్ సైతం శనివారం నాటి పెను భూకంపానికి వణికిపోయింది. పర్వతం పై నుంచి భారీ మంచు చరియలు విరిగిపడటంతో.. నేపాల్ వైపున గల బేస్ క్యాంపుల్లో ఉన్న పర్వతారోహకుల్లో 22 మంది ప్రాణాలు కోల్పాయారు. మరో 217 మంది ఆచూకీ తెలియటం లేదు.విదేశీయలతో సహా వందలాది మంది పర్వతారోహకులు అక్కడ చిక్కుబడి ఉన్నారు.
ఆదివారం నాటి తీవ్ర భూప్రకంపనల కారణంగా కూడా ఎవరెస్ట్‌పై మళ్లీ మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ చిక్కుబడి ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. వారిని రక్షించటానికి, తరలించటానికి మరికొంత సమయం పడుతుందని నేపాల్ మౌంటెయినీరింగ్ అసోసియేషన్ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. అయితే.. ఎవరెస్ట్ పర్వతానికి టిబెట్ వైపున బేస్ క్యాంపుల్లో 400 మంది పర్వతారోహకులు క్షేమంగా ఉన్నారని చైనా అధికారులు తెలిపారు. వారిలో చాలా మంది పర్వతం దిగిపోయారని, ఇంకొంత మంది దిగుతున్నారని చెప్పారు.
మొత్తం 8,848 మీటర్ల ఎత్తు ఉండే ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వత శిఖరం. ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా వందలాది మంది ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు వస్తుంటారు. నేపాల్ పర్యాటక మంత్రిత్వశాఖ అధికారుల అంచనా ప్రకారం.. శనివారం నాటి పెను భూకంపం వచ్చి, ఎవరెస్ట్‌పై మంచు చరియలు విరిగిపడినప్పుడు.. నేపాల్ వైపు బేస్ క్యాంప్ వద్ద 400 మంది విదేశీయులతో సహా దాదాపు 1,000 మంది పర్వతారోహకులు ఉన్నారు.
మంచు చరియలు బేస్ క్యాంపులోని ఒక భాగాన్ని ముంచేశాయి. బేస్ క్యాంప్ వద్ద 17 మంది చనిపోగా.. క్యాంపు దిగువు ప్రాంతాల్లో మరో ఐదుగురు చనిపోయారు. ఈ విపత్తులో 60 మంది పర్వతారోహకులు గాయపడ్డారు. ఇంకా చాలా మంది విదేశీ పర్వతారోహకులు, వారి సహాయకులు, మార్గదర్శకులు ఈ మంచు కింద సమాధి అయివుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. తీవ్రంగా గాయపడ్డ వారిలో 22 మందిని భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు ఐదు విడతల్లో తరలించాయి. కొందరిని కఠ్మాండుకు తరలించారు.
ఎవరెస్ట్ వద్ద బస చేసివున్న భారత సైనిక పర్వతారోహణ బృందం బేస్ క్యాంప్ వద్ద (17,500 అడుగుల ఎత్తులో) క్షేమంగా ఉందని.. శనివారం మంచు చరియల్లో చనిపోయిన 13 మంది మృతదేహాలను వెలికి తీసేందుకు సాయపడిందని భారత సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు.ఏడు ఖండాల్లోని అన్ని అతి పెద్ద పర్వతాలనూ అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ పర్వతారోహకుడు అంకుర్ బహల్ (54), ఆయన సహ పర్వతారోహకులు మరో 15 మంది ఎవరెస్ట్ పర్వతంపై రెండో క్యాంపు వద్ద చిక్కుకుపోయారు.
ఎవరెస్ట్‌పై గూగుల్ ఉద్యోగి మృతి
ఎవరెస్ట్ పర్వతంపై మంచుచరియలు విరిగిపడడంతో గూగుల్ ఉద్యోగి డాన్ ఫ్రెడిన్‌బర్గ్ శనివారం మరణించారు. ఈయన గూగుల్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డ్రైవర్ లేని కారు’ ప్రాజెక్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ ప్రాజెక్టులో కూడా పనిచేస్తున్నారు. ఈయనతోపాటున్న మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు.
ఎవరెస్టు వద్ద 217 మంది గల్లంతు?
Published Mon, Apr 27 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM
Advertisement
Advertisement