ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న కరుడుగట్టిన నేరగాడు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎలా ఉంటాడు?
వెలుగులోకి వచ్చిన కొత్త ఫొటో
ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న కరుడుగట్టిన నేరగాడు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎలా ఉంటాడు? 60 ఏళ్ల అతడు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? గుర్తుపట్టలేనంతగా మారిపోయాడా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన అతని ఫొటో ఒకటి అదేమీ జరుగలేదని వెల్లడిస్తున్నది. 1993లో ముంబై వరుస పేలుళ్ల అనంతరం దావూద్ దిగిన ఫొటో ఒకటి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది.
ముంబై పేలుళ్లకు పాల్పడి.. ఆ తర్వాత భారత్ నుంచి పారిపోయిన దావూద్ ప్రస్తుతం పాక్‌లో గడుపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల కిందట కరాచీ వెళ్లిన భారత జర్నలిస్టు వివేక్ అగర్వాల్.. అక్కడ దావూద్ ఫొటో తీశాడు. అప్పట్లో మొయిన్ ప్యాలెస్ లో ఉండే దావూద్ ఆ తర్వాత మకాం మార్చాడు. ఈ ఫొటోలో దావూద్ నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తాపైజామా ధరించి ఉన్నాడు. మీసం తొలగించి క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్న అతడు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదని ఈ ఫొటో స్పష్టం చేస్తున్నది. ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఫొటోలు కొన్నింటినీ భారత్ గత ఏడాది ఆగస్టు 22న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాక్‌లోని కరాచీలో దావూద్ యథేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్ చెప్తుండగా.. పాక్ మాత్రం తమ గడ్డపై దావూద్ లేనేలేడని వాదిస్తున్నది.