
న్యూఢిల్లీ: ఒకవైపు దట్టంగా కమ్మేసిన పొగ మంచు.. మరోవైపు కాలుష్య మేఘాలతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం ఉక్కిరిబిక్కి రైంది. పంజాబ్, హరియాణాల్లో పంటలను కాల్చడం వల్ల వెలువడిన పొగ, వేడి గాలు లకు.. ఉత్తరప్రదేశ్ మీదుగా వీస్తున్న మంచుతో కూడిన చలిగాలులు తోడవ్వడంతో ఢిల్లీ వాసులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇళ్లలో లివింగ్ రూమ్‌లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలోకి కాలుష్యపూరితమైన గాలి చేరడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవ డానికి కూడా అవస్థలు పడ్డారు. పొగ మంచు కారణంగా విజిబులిటీ లెవెల్స్ తగ్గిపోవడం విమాన, రైలు సర్వీసులపై ప్రభావం చూపింది. మరోవైపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 స్కేల్‌కుగానూ 448గా నమోదయ్యింది. దీంతో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా అధికారులు పార్కింగ్ ఫీజులను పేంచేశారు. మెట్రో ధరలను తగ్గించారు.
నాలుగు రెట్లు పెరిగిన పార్కింగ్ ఫీజు
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన వాతావరణ కాలుష్య నివారణ, నియంత్రణ అథారిటీ(ఈపీసీఏ).. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రీజియన్ (ఎన్‌సీఆర్)లో ఉన్న రాష్ట్రాలు సైతం సరి–బేసి తరహా చర్యలను మళ్లీ అమలులోకి తీసుకురావాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ జీఆర్‌ఏపీలో చేపట్టిన చర్యలు రీజియన్ అంతటా అమలవుతాయని ఈపీసీఏ పేర్కొంది.
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పార్కింగ్ ఫీజులను నాలుగు రెట్లు పెంచాలని ఈపీసీఏ చైర్మన్ భూరిలాల్ రీజియన్‌లోని స్థానిక సంస్థలను ఆదేశించారు. అలాగే పది రోజుల పాటు రద్దీ లేని సమయాల్లో ఢిల్లీ మెట్రో చార్జీలను తగ్గించాలని, మరిన్ని బోగీలను పెంచాలని, తరచుగా సర్వీసులను నడపాలని సూచించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, హరియాణా రాష్ట్రాలు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని, మరిన్ని బస్సులను ప్రారంభించాలని ఆదేశించారు.
గ్యాస్ చాంబర్‌లా ఢిల్లీ..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీటర్‌లో స్పందిస్తూ.. ‘‘ఢిల్లీ విషవాయువులు నిండిన గది(గ్యాస్ చాంబర్)లా మారింది. కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నందువల్ల కొద్దిరోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాను కోరాను’’అని తెలిపారు.
ఢిల్లీలో పరిస్థితి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తోందని, చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో ఆటలు, ఇతర కార్యకలాపాలను నిలుపుదల చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. పొగమంచు వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో 300కుపైగా విమానాలు దాదాపు రెండుగంటల ఆలస్యంగా నడుస్తున్నాయి.
పాఠశాలలకు సెలవు..
ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. మిగిలిన పాఠశాలల్లో బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దన్నారు. గురువారం పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక వృద్ధులు, ఆరోగ్య సమస్యలు కలిగిన వారు బయటకు వెళ్లొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment