కొత్త రక్తం.. కొత్త రూపం! | New ministers in Narendra modi cabinet | Sakshi
Sakshi News home page

కొత్త రక్తం.. కొత్త రూపం!

Published Wed, Jul 6 2016 2:35 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

కొత్త రక్తం.. కొత్త రూపం!

కొత్త రక్తం.. కొత్త రూపం!

జవదేకర్‌కు కేబినెట్ హోదా.. వెంకయ్యకు సమాచారం
మోదీ మంత్రివర్గంలో భారీ మార్పుచేర్పులు
ఐదుగురు సహాయమంత్రులపై వేటు.. కొత్తగా 19 మందికి చోటు
78కి పెరిగిన మంత్రివర్గం.. జవదేకర్‌కు మానవవనరులు అప్పగింత
మానవవనరుల నుంచి స్మృతి ఇరానీ తొలగింపు.. జౌళిశాఖకు బదిలీ
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ.. వెంకయ్య నుంచి అనంత్‌కుమార్‌కు బదిలీ
అరుణ్‌జైట్లీ నుంచి వెంకయ్యనాయుడుకు సమాచార, ప్రసారశాఖ
న్యాయశాఖ నుంచి గణాంకాలు, పథకాల శాఖకు సదానందగౌడ బదిలీ
రవిశంకర్‌ప్రసాద్‌కు న్యాయశాఖ.. బీరేంద్రసింగ్‌కు ఉక్కుశాఖ కేటాయింపు
నరేంద్రసింగ్‌తోమర్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు శాఖలు

 
సాక్షి, న్యూఢిల్లీ: భారీస్థాయి మార్పులు, చేర్పులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రివర్గానికి కొత్తరూపునిచ్చారు. ఐదుగురు సహాయమంత్రులను తొలగించి.. కొత్తగా 19 మందికి చోటు కల్పిస్తూ విస్తరించటంతో పాటు.. పలువురు మంత్రుల శాఖలనూ మార్చుతూ పునర్‌వ్యవస్థీకరించారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతిభవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరుగగా.. రాత్రికి మంత్రివర్గంలో పలు శాఖల మార్పులతో కేటాయింపులు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శాఖలు మినహా మిగిలిన మంత్రుల్లో చాలా మందికి శాఖలు మారాయి.
 
  మానవవనరుల అభివృద్ధిశాఖను స్మృతి ఇరానీ నుంచి తొలగించారు. ఆ శాఖను ప్రకాశ్‌జావదేకర్‌కు తాజాగా కేబినెట్ హోదా కల్పిస్తూ ఆయనకు అప్పగించారు. స్మృతిఇరానీని అంతగా ప్రాధాన్యం లేని జౌళిశాఖకు మార్చారు. ముఖ్యంగా.. హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలోనూ, జేఎన్‌యూ వివాదంలోనూ స్మృతి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమెను మానవవనరుల అభివృద్ధిశాఖ నుంచి తప్పించి తక్కువ ప్రాధాన్యం గల శాఖకు బదిలీ చేయటం వ్యూహాత్మక ఎత్తుగడేనా? లేకపోతే.. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ముఖచిత్రంగా ఆమెను వినియోగించుకునేందుకు బాధ్యతల బరువును తగ్గించారా? అన్న అంశాలపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
 
  ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వద్ద అదనంగా ఉన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఎం.వెంకయ్యనాయుడికి కేటాయించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా జైట్లీ వద్దే ఉంది. వెంకయ్యనాయుడు ఇప్పటివరకు పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్నారు. తాజా మార్పుల్లో ఆయన నుంచి పార్లమెంటరీ వ్యవహారాలను తప్పించి సమాచార ప్రసారశాఖను కేటాయించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను అనంత్‌కుమార్‌కు అదనంగా కేటాయించారు. అనంత్ ప్రస్తుతం రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.
 
  న్యాయశాఖను సదానందగౌడ నుంచి తప్పించి.. సమాచార సాంకేతికత(ఐటీ) శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు అప్పగించటం   కీలక మార్పు. సదానందకు గణాంకాలు, పథకాల అమలు శాఖను కేటాయించారు.
 
  చౌదరి బీరేంద్రసింగ్‌కు ఉక్కు శాఖను కేటాయించి.. ఆయన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ, తాగునీరు, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్ శాఖలను నరేంద్రసింగ్ తోమర్‌కు కేటాయించారు. తోమర్ ఇప్పటివరకూ గనులు, ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు.
 హా విద్యుత్, బొగ్గు, పునర్వినియోగిత ఇంధనశక్తి శాఖకు స్వతంత్ర సహాయమంత్రిగా ఉన్న పీయూష్‌గోయల్‌కు అదనంగా గనుల శాఖ  ఇచ్చారు. హా రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న మనోజ్‌సిన్హాకు సమాచారశాఖను స్వతంత్ర సహాయమంత్రి హోదాలో అప్పగించారు.
 
  జౌళిశాఖ స్వతంత్ర సహాయమంత్రిగా ఉన్న సంతోష్‌కుమార్ గాంగ్వర్‌ను ఆర్థికశాఖకు బదిలీ చేశారు. హా ఆర్థికశాఖలో సహాయమంత్రిగా ఉన్న జయంత్‌సిన్హాను పౌరవిమానయానశాఖకు మార్చారు. ఇప్పటివరకూ ఆ శాఖలో ఉన్న మహేశ్‌శర్మను సంస్కృతి, పర్యాటక శాఖకు మార్చారు. హా అర్జున్‌రామ్‌మేఘ్వాల్‌ను ఆర్థికశాఖలో రెండో సహాయమంత్రిగా చేర్చారు. హా ఇక కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో.. విజయ్‌గోయల్‌కు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖకు స్వతంత్ర సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖను ఇంతకుముందు సర్బానంద సోనేవాల్ నిర్వహించేవారు. ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా వెళ్లిన విషయం తెలిసిందే.
  ఇక పర్యాటక శాఖకు జవదేకర్ స్థానంలో అనిల్‌మాధవ్ దవేను స్వతంత్ర సహాయమంత్రిగా నియమించారు.
  అప్నాదళ్ నేత అనుప్రియాపాటిల్‌తో పాటు, ఫగన్‌సింగ్ కులస్తేలకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖలో సహాయమంత్రులుగా చోటు కల్పించారు.
  డాక్టర్ ఎస్.ఆర్.భామ్రేను రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
  కేబినెట్ మంత్రుల్లో గడ్కరీ, ఉమాభారతి, అశోక్‌గజపతిరాజు, పారికర్, సురేష్‌ప్రభు, రాంవిలాస్‌పాశ్వాన్, కల్‌రాజ్‌మిశ్రా, మేనకా సంజయ్‌గాంధీ, నజ్మాహెప్తుల్లా, జె.పి.నడ్డా, అనంత్ గీతే, హర్‌సిమ్రత్‌కౌర్, జ్యుయల్ ఓరమ్, రాధామోహన్‌సింగ్, తావర్‌చంద్ గెహ్లాట్ తదితరుల శాఖల్లో మార్పు లేదు.
 
ఐదుగురు సహాయ మంత్రులపై వేటు...
కేంద్రంలో 2014 మేలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. దాదాపు రెండేళ్ల తర్వాత చేపట్టిన రెండో మంత్రివర్గ విస్తరణతో పాటే.. కీలక మార్పులూ చేయటం విశేషం. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో త్వరలో జరుగున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. దళితులు, వెనుకబడిన వర్గాల వారిలో పార్టీని బలోపేతం చేసుకోవటం లక్ష్యంగా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ ఈ విస్తరణ చేపట్టారు. ఇప్పటివరకు 64 మందిగా ఉన్న మంత్రివర్గ సభ్యుల సంఖ్య తాజా విస్తరణతో 78కి పెరిగింది.
 
 ఒకవైపు మంత్రివర్గానికి కొత్త రక్తం ఎక్కిస్తూనే.. పలు శాఖల మార్పులతో కేబినెట్‌కు కొత్త రూపునూ ఇచ్చారు. ఇప్పటివరకు స్వతంత్ర సహాయమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక్కరికే పదోన్నతినిస్తూ కేబినెట్ హోదా కల్పించారు. అలాగే ఐదుగురు సహాయమంత్రులు సన్వర్‌లాల్ జాట్ (జలవనరుల శాఖ), మోహన్‌భాయ్ కుందరియా (వ్యవసాయశాఖ), నిహాల్‌చంద్ (పంచాయతీరాజ్), మన్‌సుఖ్‌భాయ్ ధాంజీభాయ్ (గిరిజన వ్యవహారాలు), ప్రొఫెసర్ రామ్‌శంకర్ కతేరియా (మానవ వనరుల అభివృద్ధి)లపై వేటు వేశారు. వారి రాజీనామా లేఖలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం నాడే ఆమోదించారు.
 
మంత్రుల శాఖల్లో తాజా మార్పులు
ప్రకాశ్ జవదేకర్ - మానవ వనరుల శాఖ (కేబినెట్ హోదా)
స్మృతి ఇరానీ - చేనేత, జౌళి శాఖ (మానవ వనరుల శాఖ మార్పు)
రవిశంకర్ ప్రసాద్ - ఐటీ శాఖకు అదనంగా న్యాయ శాఖ
సదానంద గౌడ - గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రి (న్యాయ శాఖ తొలగింపు)
అనంత కుమార్ - ఎరువులు, రసాయనాల శాఖకు అదనంగా పార్లమెంటరీ వ్యవహారాలు
వెంకయ్య నాయుడు - పట్టణాభివృద్ధి శాఖకు అదనంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (పార్లమెంటరీ వ్యవహారాలు, గృహ నిర్మాణం తొలగింపు)
పీయూశ్ గోయల్ - విద్యుత్, పునరుత్పత్తి విద్యుత్ శాఖకు అదనంగా గనులు
చౌదరీ బీరేంద్ర సింగ్ - స్టీల్ (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం తొలగింపు)
►  హన్సరాజ్ గంగారామ్ ఆహిర్ - హోం శాఖ సహాయ మంత్రి (ఎరువులు, రసాయనాలు శాఖ తొలగింపు)
సంతోష్ కుమార్ గంగ్వార్ - ఆర్థిక శాఖ సహాయ మంత్రి (చేనేత, జౌళి శాఖ తొలగింపు)
మనోజ్ సిన్హా - రైల్వే సహాయ మంత్రి, కమ్యూనికేషన్స్ (అదనం)
సంజీవ్ కుమార్ - జలవనరులు, నదుల అనుసంధానం (సహాయ మంత్రి) వ్యవసాయం (తొలగింపు)
జయంత్ సిన్హా - పౌర విమానయాన (సహాయ మంత్రి) (ఆర్థిక సహాయ మంత్రి తొలగింపు)
హరిభాయ్ చౌదరి - సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (సహాయ మంత్రి) (హోం శాఖ తొలగింపు)
రావ్ ఇందర్‌జిత్  సింగ్ - ప్రణాళిక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన (సహాయ మంత్రి) (రక్షణ శాఖ తొలగింపు)
నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుధ్య (సహాయ మంత్రి), (గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖ తొలగింపు)
 
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
అనిల్ మాధవ్ దవే - అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పులు (స్వతంత్ర)
విజయ్ గోయల్ - క్రీడలు, యువజన సర్వీసులు (స్వతంత్ర)
అర్జున్ రామ్ మేఘ్వాల్ - ఆర్థికర, కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ మంత్రి)
ఎస్‌ఎస్ అహ్లువాలియా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు (సహాయ మంత్రి)
ఫగన్ సింగ్ కులస్తే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి)
అనుప్రియ పటేల్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి)
రాజన్ గోహెన్ - రైల్వే శాఖ (సహాయమంత్రి)
ఎంజే అక్బర్ - విదేశీ వ్యవహారాలు (సహాయ మంత్రి)
కృష్ణపాల్ - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి)
రాందాస్ అఠావలే - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి)
జస్వంత్ సింహ బహదూర్ - గిరిజన వ్యవహారాలు
పీపీ చౌదరి - న్యాయ, ఐటీ శాఖలు (సహాయ మంత్రి)
డాక్టర్ సుభాష్ భామ్రే - రక్షణ (సహాయమంత్రి)
సీఆర్ చౌదరి - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ (సహాయ మంత్రి)
అజయ్ తాంతా - చేనేత, జౌళి (సహాయ మంత్రి)
మన్షుక్ మాండవీయ - రహదారులు, రవాణా, షిప్పింగ్, ఎరువులు-రసాయనాలు (సహాయ మంత్రి)
పర్షోత్తమ్ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీ రాజ్ (సహాయ మంత్రి)
డాక్టర్ మహేంద్రనాథ్ పాండే - మానవ వనరుల శాఖ (సహాయ మంత్రి)
రమేశ్ చందప్ప జిగజినాగి - తాగునీరు, పారిశుద్ధ్యం
 
వేటు వీరిపైనే
సన్వర్‌లాల్ జాట్, మోహన్‌భాయ్ కుందరియా, నిహాల్‌చంద్, మన్‌సుఖ్‌భాయ్ ధాంజీభాయ్, ప్రొఫెసర్ రామ్‌శంకర్ కతేరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement