ఆ రాక్షసుడ్నిసమాజంలో వదిలేస్తారా?
అతి క్రూరంగా... దారుణంగా.. అత్యాచారానికి పాల్పడిన ఆ రాక్షసుడికి కేవలం మూడేళ్ళే జైలా? శిక్షా కాలం పూర్తయితే అతడిని విడుదల చేస్తారా? ఇప్పుడు మాత్రం అతడి ప్రవర్తన సరిగా ఉంటుందన్న నమ్మకమేమిటి? సమాజంలో ఇటువంటి వారిని వదిలేయడం సరైన పనేనా అంటూ నిర్భయ కేసులో బాల నేరస్థుడి విషయంలో పలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మానవ హక్కుల కమిషన్ కూడా బాధితుల తరపున విన్నవించింది. వీటన్నింటికీ మించి అతడు జిహాదీగా మారే అవకాశాలున్నాయంటూ పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడ పునరాలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో బాల నేరస్థుడి విడుదలపై ఎటువంటి నిర్ణయం వెలువడుతుందోనని అంతా ఉత్కఠతో ఎదురు చూస్తున్నారు.
2012 లో జరిగిన గ్యాంగ్ రేప్‌లో బాల నేరస్థుడ్ని ఈ నెల 15న విడుదల చేయాల్సి ఉంది. అయితే అతడి విడుదలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అతడిని సమాజంలోకి వదిలేస్తే మరిన్ని విపత్కర సంఘటనలు చోటు చేసుకుంటాయని జాతీయ మానవ హక్కుల సంఘం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. ''ప్రజల జీవితానికి, స్వేచ్ఛకు ఇటువంటి వాడు ప్రమాదకారి'' అంటూ నిర్భయ బాధితుల వినతి మేరకు ఎన్ హెచ్ఆర్సీ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం నేరస్థుడి కస్టడీని మరో ఏడాది పొడిగించింది. 2011 హైకోర్టు పేలుడు ఘటనలో దోషులుగా ఉన్న మరి కొంతమంది యువ ఖైదీలతోపాటు ఈ బాల నేరస్థుడు శిక్ష అనుభవిస్తున్నాడు.
విడుదల తర్వాత జువైనల్.. సమాజానికి ఎటువంటి హాని తలపెట్టడని హామీ ఇవ్వాల్సిందిగా జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి చేసిన అభ్యర్థనకు ఢిల్లీ కోర్టు కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. దీనికి ప్రతిస్పందనగా శుక్రవారం ఓ ఇంటిలిజెన్స్ రిపోర్టును కూడా సమర్పించింది. జువైనల్... సంక్షేమ గృహంలో ఉన్నపుడు అతడి భాగస్వాముల ప్రేరణతో కాశ్మీర్ జిహాదీల్లో చేరేందుకు యోచించినట్లుగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదిక సమర్పించింది. దీనికి తోడు అతడి నిర్భంధం కొనసాగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని సంక్షేమ గృహం (మజ్నూకా తిల్) పరిశీలన కేంద్రం ప్రతినిధులు వెల్లడించారు. ఇలా అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు అందిన మేరకు బాల నేరస్థుడి విడుదల విషయంలో కోర్టు పునరాలోచన చేస్తోంది. తీర్పును డిసెంబర్ 14 కు వాయిదా వేసింది.