ఐఐఎస్‌ఎఫ్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హర్షవర్థన్, నితిన్ గడ్కరీ
లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: జ్ఞానాన్ని సంపదగా మార్చడం దేశానికి అత్యవసరమైన విషయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ మార్పు నకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. సోమవారం లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2018 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో రైతులను ఇంధన వనరుల ఉత్పత్తి వైపు మళ్లిస్తే అటు దేశానికి చమురు దిగుమతుల భారం తగ్గడం మాత్రమే కాకుండా, రైతులకు మంచి ఆదాయం కూడా లభిస్తుందన్నారు. రానున్న ఐదేళ్లలో బయో ఇథనాల్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల వరకూ ఉంటుందన్నారు. వెదురు, ఇతర ఆహారేతర వనరుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి ద్వారా రైతులు లబ్ధి పొందాలని సూచించారు. తగిన సాంకేతికత అందుబాటులో ఉంటే సాధించలేనిది ఏదీ లేదని స్పష్టం చేశారు. రవాణా రంగంలో కేంద్రమంత్రిగా తాను తీసుకున్న చర్యల వల్ల దేశానికి వందల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నడిచే ‘సైన్స్ ఇండియా’ వెబ్‌సైట్‌ను గడ్కరీ ఆవిష్కరించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి ‘జై విజ్ఞాన్’ జోడిస్తే.. ఇప్పుడు దీనికి ‘జై అనుసంధాన్’ కూడా చేర్చాలని సూచిం చారు. పాఠశాలలు, విద్యార్థులు నేరుగా ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, విజ్ఞాన భారతి అధ్యక్షుడు డాక్టర్ విజయ్ భాస్కర్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన సైన్స్ కుంభమేళా..
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ఫలాలను దేశం నలుమూలలకు చేర్చే లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ ఎఫ్) సంబరాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా ఈ నెల 5న మొదలైన ఈ ఉత్సవాలకు సుమారు 13 వేల మంది హాజరైనట్టు అంచనా. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 2,300 కాగా, మిగతావారిలో ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామి కవేత్తలు ఉన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, వాయు కాలుష్యం, శాస్త్ర ప్రపంచంలో మహిళల పరిస్థితి వంటి 23 అంశాలపై చర్చలు జరిగాయి. సీఎస్‌ఐఆర్, డీఆర్‌డీవో, వేర్వేరు ప్రభుత్వ సంస్థలు ఆయా రంగా ల్లో సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐఐఎస్‌ఎఫ్ ఉత్సవాలను వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment