గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ
• మరో సంఘ్ నేతకు పట్టంగట్టిన బీజేపీ అధిష్టానం
• ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
• 2017 ఎన్నికలకు ముందు కమలదళం కీలక నిర్ణయం
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రిగా.. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ రూపానీ ఎంపికయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి గడ్కారీల సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆనందీబెన్ వారసుడిగా.. రూపానీని ఎన్నుకున్నారు. చివరి నిమిషందాకా సీనియర్ నేత నితిన్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అటు అమిత్ కూడా పార్టీ ముఖ్యనేతలతో తీవ్ర చర్చలు జరిపారు. రూపానీని ప్రకటించేంతవరకు రెండు పేర్లపై (నితిన్, రూపానీ) తర్జనభర్జనలు జరిగాయి. అయితే భేటీ ప్రారంభమైన వెంటనే.. రూపానీ పేరును గడ్కారీ ప్రతిపాదించారు. దీనికి ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. నితిన్‌ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటించిన తర్వాత సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేశాక శుక్రవారం రూపానీ పేరును ప్రకటించింది. వచ్చే ఏడాది(2017 చివర్లో) జరిగే ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు సమర్థుడు, వివాదరహితుడు ఉండాలనే రూపానీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2 దశాబ్దాలకు పైగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి పటేళ్ల కోటా, ఉనా దళితులపై దాడి వంటివి తలనొప్పిగా మారాయి. దీనికి తోడు 2015 చివర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవటం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటిస్తూ.. కంటిలో నలుసులా మారటం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.
సమర్థతకు పట్టం
బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ రూపానీ మయన్మార్‌లోని రంగూన్‌లో ఆగస్టు 2, 1956న జైన వైశ్య(గుజరాత్‌లో మైనారిటీలు) కుటుంబంలో జన్మించారు. తర్వాత వీరి కుటుంబం సౌరాష్ట్రకు వలస వచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పటినుంచే ఆరెస్సెస్, ఏబీవీపీల్లో చురుకుగా ఉన్న రూపానీ.. సౌరాష్ట్ర వర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాపొందారు. 1971లో జన్‌సంఘ్‌లో.. ఆ తర్వాత బీజేపీలో ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. రాజ్‌కోట్‌లో కార్పొరేటర్‌గా, మేయర్‌గా కూడా పనిచేశారు. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా స్నేహపూర్వకంగా పరిష్కరిస్తాడని కార్యకర్తలు చెప్పుకునే విజయ్ రూపానీకి ప్రధాని మోదీ, అమిత్‌షాతో చాలా సాన్నిహిత్యం ఉంది. గుజరాత్ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఈయన చేపట్టిన ‘ఖుష్‌బూ గుజరాత్‌కీ’ ప్రచారం దేశాన్ని ఆకర్షించింది.
2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉండి.. జలవనరులు, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థ వంటి కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2014లో రాజ్‌కోట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వాజూభాయ్ వాలా రాజీనామా చేసి కర్ణాటక గవర్నర్‌గా వెళ్లడంతో ఖాళీ అయిన స్థానంలో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈయన సమర్థత, చతురత కారణంగా ఆనందీబెన్ పటేల్ కేబినెట్‌లో కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. బలమైన సామాజిక వర్గం నేపథ్యం లేకపోయినా పటేళ్ల ఉద్యమం తీవ్రంగా ఉన్న సౌరాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహించటం కలిసొచ్చింది. దీనికి తోడు ఆరెస్సెస్‌తో సుదీర్ఘ అనుబంధం, సమస్యల వలయంలో ఉన్న పార్టీని 2017 ఎన్నికల్లో నడిపే సమర్థత ఉందని పార్టీ అధిష్టానం భావించటం రూపానీని సీఎం పీఠం ఎక్కించాయి.