
‘ఇప్పటికీ అంకులే.. కానీ చాలా దెబ్బకొట్టారు’
పట్నా: తనను రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అస్సలే అడగలేదని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ అన్నారు. తాను లీగల్ ఒపినీయన్ తీసుకుంటున్నానని, ఆ విషయమే నితీశ్‌తో చెప్పానని అన్నారు. తనకు ఇప్పుడు 22 ఏళ్లేనని కానీ, తనకు ఎలాంటి భయం లేదని చెప్పారు. శుక్రవారం బిహార్ అసెంబ్లీలో నితీశ్ కుమార్ బలపరీక్ష సందర్భంగా ఆయన తేజస్వీ మీడియాతో మాట్లాడారు. సుశీల్‌కుమార్ మోదీ కూడా పలు కేసులు ఎదుర్కొంటున్నారని, ఆయనను ఎలా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనిచ్చారని మండిపడ్డారు. నరేంద్రమోదీ అంత వేగంగా ట్వీట్ ఎలా చేయగలిగారని నిలదీశారు. నితీశ్ ఇప్పటికీ తనకు అంకుల్‌ల్లాంటివారేనని కానీ దెబ్బకొట్టారని మండిపడ్డారు.
నిజంగా ఆయన తనను రాజీనామా చేయాలని అడిగి ఉంటే ఆలోచించేవాడినని తెలిపారు. తమకే ఎక్కువ మెజార్టీ ఉన్నా నితీశ్‌నే ముఖ్యమంత్రిని చేశామని, త్యాగం చేశామని చెప్పారు. ’మహాత్మాగాంధీని హత్య చేసిన వారితో చేతులు కలుపుతున్నారని నితీశ్‌పై బిహార్ అసెంబ్లీలో పలువురు అనుకుంటున్నారు. ఆయన హేరామ్ నుంచి జైశ్రీరామ్‌కు మారిపోయారు. నేను దళితులకు, మైనారిటీలకోసం పనిచేశాను. ఇంకా నేనేం చేయాలి. ప్రతి రాష్ట్రాన్ని బీజేపీ పరిపాలిస్తుందని అమిత్‌షా అంటే నితిష్ మాత్రం సంఘ్ విముక్తి భారత్ అని అన్నారు. ఆయన చేసే పోరాటంలో నేను కూడా నితీశ్‌తో ఉన్నాను.. కానీ, ఆ విషయం మరిచిపోయారు. బిహార్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ మాకు సహాయం చేయలేదు.
లాలూపై కేసులు పెడుతున్న విషయం నితీశ్‌కు తెలియదని చెప్పడం అబద్ధం. ముందే నితీశ్ ప్రణాళిక రచించుకొని బీజేపీలోకి వెళ్లారు. నన్ను ఒక పావులాగా వాడుకున్నారు. బిహార్ అసెంబ్లీలో ఒకరినొకరు దారుణంగా తిట్టుకున్న నితీశ్, సుశీల్ ఇప్పుడు కలిసిపోయారు. ఇది చూసి వారు సిగ్గు పడాలి. నితీశ్‌కు నన్ను తొలగించే దమ్ము లేదు. బీజేపీ పేరాశగల పార్టీ. నితీశ్ ఒంటరిగా పోరాడిన 1995లో ఏడు సీట్లు వచ్చాయి. 2014లో రెండు సీట్లు వచ్చాయి. అప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడికి వెళ్లింది. నాలుగేళ్లలో నాలుగు ప్రభుత్వాలు మారాయి. ఎవరు దీనికి బాధ్యత? ప్రజలకు సమాధానం చెప్పాలి. 2015లో బీజేపీకి వ్యతిరేకంగా ఐదేళ్లకోసం చేసుకున్న నిర్ణయానికి నితీశ్ దెబ్బకొట్టారు’ అని తేజస్వీ నిప్పులు చెరిగారు.