సీఎం పెయింటింగ్.. రాజకీయాల్లో మార్పులు!
పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ వేసిన ఓ పెయింటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. నితీశ్ పెయింటింగ్ ఉద్దేశం ఏంటో తెలియదు గానీ, బిహార్ రాజకీయాలను ఆ పెయింటింగ్ సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో శనివారం జరిగిన బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో నితీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీయూ నేత నితీశ్ పెయింటింగ్ బ్రష్ చేతపట్టి బీజేపీ పార్టీ రాజకీయ చిహ్నమైన కమలం గుర్తును గీశారు. అది మొదలుకుని ఆర్జేడీ, బీజేపీ నేతల మధ్య రాజకీయ చర్చ మొదలైంది.
సీఎం నితీశ్ తాను ఇండిపెండెంట్ వ్యక్తిగా భావిస్తున్నారని, తన చిరకాల మిత్రుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు ఈ రూపంలో పరోక్షంగా సంకేతాలు పంపించారని వదంతులు వ్యాపించాయి. దీనికి తోడు బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బిహార్ లో సొంతంగా వ్యవహరించాలని నితీశ్ భావిస్తున్నారని, తన రాజకీయ రంగు, తన విధానం ఎలా ఉండబోతుందన్న దానిపై పెయింటింగ్ ద్వారా బహిర్గతం చేశారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా.. నితీశ్ మాత్రం ఆ నిర్ణయానికి మద్ధతు తెలిపారని గుర్తుచేశారు.
బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆర్జేడీ చీఫ్ లాలూ తనయుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. కమలం అనగానే అది కేవలం బీజేపీకే చెందినట్లయితే, ఆర్జేడీ సింబల్ లాంతర్ దేశంలో చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లో ఉంటుంది కదా.. దీంతో దేశమంతా ఆర్జేడీకే మద్ధతుగా ఉందని ప్రచారం చేస్తారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తు పెయింటింగ్ వేశారని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే బీజేపీ నేతలు సంబరపడతారంటే తమకు వచ్చిన నష్టమేమి లేదని తేజస్వి యాదవ్ అన్నారు.