రాంచీ: సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేయడంపైనే ప్రధానంగా చర్చించామని జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్‌తో భేటీ తర్వాత జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రకటించారు. బుధవారం రాంచీకి చేరుకున్న నితీశ్.. ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‌తోపాటు సోరెన్‌తో చర్చలు జరిపారు. ‘ బీజేపీని ఓడించడం, విపక్షాలను ఏకతాటి మీదకు తేవడంపైనే చర్చించాం.
ఈ సంప్రదింపుల ఫలితం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చరిత్రను తిరగరాయాలన్న బీజేపీ సర్కార్ కుతంత్రాలను మేం తిప్పికొడతాం. హిందూ–ముస్లిం ఐక్యతను మళ్లీ పునఃప్రతిష్టిస్తాం ’ అని నితీశ్ మీడియాతో అన్నారు. ఎన్‌డీఏయేతర పార్టీలను ఏకంచేసే క్రమంలో విపక్ష పార్టీల అగ్రనేతలతో వరసగా భేటీలను నితీశ్ కొనసాగిస్తున్న విషయం తెల్సిందే.
మంగళవారం ఒడిశాకు వెళ్లిన నితీశ్ అక్కడ బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో గంటకుపైగా మంతనాలు జరిపారు. ఇటీవల ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లనూ కలిశారు. ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేనూ నితీశ్ కలిశారు. అంతకుముందు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, ఆప్ అధినేత కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులతోనూ భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment