హాజరుకానున్న పలువురు నేతలు
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (49) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాబాది మైదానంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లను సోరెన్ బుధవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 24 సీట్లు సాధించడం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్‌తోపాటు భార్య కల్పన ఘన విజయం సాధించారు. ఆదివారం హేమంత్ సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాందీ, ఎన్‌సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమత, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం మాన్, హిమాచల్ సీఎం సుఖీ్వందర్..ఇంకా సీపీఎం జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఆప్ నేత కేజ్రీవాల్, శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్దవ్ ఠాక్రే,, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర ఇండియా కూట మి నేతలు హాజరవుతారని భావిస్తున్నారు.
పూర్వీకుల గ్రామంలో హేమంత్ దంపతులు
కాబోయే సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనతో కలిసి మంగళవారం బెంగాల్ సరిహద్దుల్లోని రామ్‌గఢ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వీకుల గ్రామం నెమ్రా ను సందర్శించారు. హేమంత్ తండ్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఈ గ్రామంలోనే జన్మించారు. శిబూ 15 ఏళ్లప్పుడు తండ్రి సోబరెన్‌ను స్థానిక వడ్దీ వ్యాపారులు చంపారు. తాత సోబరెన్ సోరెన్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని అక్కడికి వెళ్లిన హేమంత్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. గురువారం నుంచి మన ప్రభుత్వం పనిచేయనుందని వారికి చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన మీరంతా ప్రమాణ స్వీకారానికి రావాలని హేమంత్ వారిని ఆహ్వానించారు.
సీఎంగా నాలుగోసారి..
హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి 2013 జులై నుంచి 2014 డిసెంబర్ వరకు పనిచేశారు. రెండోసారి 2019 డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ నేపథ్యంలో 2024 జనవరిలో రాజీనామా చేశారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి 2024 జూన్లో సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. గురువారం ఆయన నాలుగోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment