
మహాకూటమి కుదేలు!
బిహార్‌లో రాజకీయం మలుపులు తిరుగుతోంది. మహాకూటమికి బీటలు వారటంతో.. సీఎం నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనబడుతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో విభేదాలు చినికి చినికి గాలివానగా మారాయి.
సంకీర్ణానికి బీటలు వారి పాతపొత్తులు మరోసారి కొత్తగా పొడిచేందుకు మార్గం సుగమమవుతోంది. పదేళ్లపాటు బీజేపీ–జేడీయూలు కలిసున్నప్పటికీ కొన్ని కారణాలతో విడిపోవటం.. ఆ తర్వాత కాంగ్రెస్ చొరవతో మహాకూటమిని ఏర్పాటు చేయటం చకచకా జరిగిపోయాయి. రెండేళ్లపాటు ఆనందంగా సాగిన కూటమికి ఇప్పుడు బీటలువారాయి. నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలతో.. 2019లో మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని మరింత బలోపేతం చేయాలనుకున్న కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల ఆశలు ఆడియాసలయ్యాయి.
మహాకూటమి ఏర్పాటుకు ముందు...
2003లో జేడీయూ ఏర్పాటైనప్పటినుంచి బీజేపీతో సత్సంబంధాలున్నా యి. వాజ్‌పేయి ఎన్డీయే ప్రభుత్వంలోనూ ఈ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించింది. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా బిహార్‌పై ఎన్డీయే పట్టు తగ్గలేదు. అయితే 2013లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటంతో.. నితీశ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. బిహార్‌లో అధికారం తమదేన ని నమ్మకంతో ఉన్న మోదీ, అమిత్‌షాలకు ఈ కొత్త కూటమి షాకిచ్చింది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 178 గెలిచి అధికారంలోకి వచ్చింది.
కూటమిపై అల్ప సంతోషమే!
మహాకూటమి బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తనకెలాగూ ఆరేళ్ల పాటు రాజకీయాల్లో పోటీచేసే అవకాశం లేకపోవటంతో లాలూ.. ఓ కుమారుడికి ఉప ముఖ్యమంత్రి, మరో కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకున్నారు. నితీశ్–లాలూ కూడా తమ మధ్య వివాదాలన్నీ సమసిపోయాయని చెప్పే యత్నం చేశారు. కాంగ్రెస్ కూడా వీరిద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగేలా ప్రయత్నించింది. కానీ కూటమితో నితీశ్ అసంతృప్తిగానే ఫీలవుతున్నారు. అందుకే కొంతకాలంగా పాత నేస్తమైన బీజేపీవైపు చూస్తున్నారు. ప్రధానిగా తను వ్యతిరేకించిన మోదీనే కీలకమైన సందర్భాల్లో నితీశ్ బహిరంగంగానే ప్రశంసించారు. 2016 సెప్టెంబరులో భారత్ సైన్యం చేపట్టిన సర్జికల్ దాడులను విపక్షాలన్నీ విమర్శించినా నితీశ్ మాత్రం సమర్థించారు.
పెద్దనోట్ల రద్దుపై విపక్షాలన్నీ విరుచుకుపడ్డా బిహార్ సీఎం సమర్థించారు. పట్నాలో గత జనవరిలో జరిగిన గురు గోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంలోనూ మోదీ, నితీశ్ పరస్పరం ప్రశంసించుకున్నారు. జనవరి 15న ‘దహి చురా’ను పురస్కరించుకొని జేడీయూ ఇచ్చిన విందుకు అనూహ్యంగా బీజేపీ నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. యూపీ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేయకపోవటం, మహాకూటమి తరపున ప్రచారానికి నితీశ్ విముఖత వ్యక్తం చేయటంపై ఆర్జేడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణాలతో కొంతకాలంగా బీజేపీ–జేడీయూ మధ్య దూరం తగ్గుతోందని.. మహాకూటమి పార్టీల మధ్య దూరం పెరుగుతోందనే సంకేతాలు సుస్పష్టమయ్యాయి.
అన్నీ వెనువెంటనే...
బిహార్ బీజేపీ నేతలు లాలూ కుటుంబ సభ్యులపై అక్రమాస్తుల ఆరోపణలు చేయడం..వెనువెంటనే సీబీఐ రంగంలోకి దిగడం, కేసులు, బినామీ ఆస్తుల జప్తు జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో లాలూకు మద్దతుగా నితీశ్ ఒక్కముక్క కూడా మాట్లాడలేదు. దీనికి తోడు తమపై వచ్చిన ఆరోపణలకు లాలూ కుమారులు ప్రజలకు వివరణ ఇవ్వాలని నితీశ్ కోరటంతో వివాదం మరింత ముదిరింది. ఇది నితీశ్ రాజీనామాకు తద్వారా కూటమి విచ్ఛిన్నానికి దారితీసింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్