
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ రాష్ట్రంలో మాంఝీ తన సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నితీష్ నాల్గోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఆదివారం బీహార్ గవర్నర్ త్రిపాఠీ నితీష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగయ్,బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంఝీ తదితరులు హాజరయ్యారు.
శుక్రవారం గవర్నర్.. నితీష్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. బీహార్ తాజా ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఈ రోజు విశ్వాస పరీక్షకు ముందే పదవికి రాజీనామా చేయడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. బీహార్ అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నితీష్ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి లైన్ క్లియరైంది. నితీష్ వారసుడిగా బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాంఝీ జేడీయూతో విభేదించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మాంఝీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. ఓ దశలో బీహార్ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఇలా అనేక మలుపులు తిరిగిన అనంతరం ఈ రోజు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు ఉన్న నితీష్ చివరకు తన కల నెరవేర్చుకున్నారు.