పాట్నా: బీహార్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఆదివారం బీహార్ గవర్నర్ నితీష్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్.. నితీష్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. బీహార్ తాజా ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఈ రోజు విశ్వాస పరీక్షకు ముందే పదవికి రాజీనామా చేయడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. బీహార్ అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నితీష్ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి లైన్ క్లియరైంది. నితీష్ వారసుడిగా బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాంఝీ జేడీయూతో విభేదించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో తగిన బలంలేని మాంఝీ సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు నిరాకరించడంతో రాజకీయ డ్రామా మొదలైంది. జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీష్ను ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నిక చెల్లదని పాట్నా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మాంఝీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. ఓ దశలో బీహార్ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఇలా అనేక మలుపులు తిరిగిన అనంతరం ఈ రోజు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు ఉన్న నితీష్ చివరకు తన కల నెరవేర్చుకున్నారు.
22న బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం
Published Fri, Feb 20 2015 5:51 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM
Advertisement
Advertisement