నితీశ్, లాలూ ఇప్పుడు ఇరుగూపొరుగు
మోడీ సునామీతో చతికిల బడిన జెడీయూ నేత నితీశ్ కుమార్, ఆర్ జే డీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు చేతులు కలిపారు. ఇబ్బందుల్లో ఉన్న జేడీయూ ప్రభుత్వానికి ఆర్జేడీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. నితీశ్ స్థానంలో కొత్తగా ముఖ్యమంత్రి అయిన జీతన్ రామ్ మాఝీకి దీనితో ఊరట లభించినట్టయింది.
బిజెపి జోరుకు జేడీయూకి రెండు, లాలూ ప్రసాద్ యాదవ్ కి మూడు లోకసభ సీట్లు దక్కాయి. దీంతో 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో శుక్రవారం జరగాల్సిన విశ్వాస పరీక్ష లో జేడీయూ గట్టెక్కేందుకు వీలు కలిగింది.
మరో వైపు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఇన్నాళ్ల తన శత్రువు, ఇప్పుడు మళ్లీ కొత్త మిత్రుడు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కి పొరుగింటి వారయ్యారు. ఇద్దరి అధికార నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి. రాజకీయ సాహచర్యమే కాదు, సహజీవన సాన్నిహిత్యమూ ఇప్పుడు ఇద్దరు నేతలకీ ఘోర ఓటమి పుణ్యమా అని లభించింది.