న్యూఢిల్లీ: నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం ఉదయం కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల సమస్యలపై ఆమె ఈ సందర్భంగా కేంద్రమంత్రితో చర్చించారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు కనీస గిట్టుబాటు ధర పెంపు విషయాన్ని కవిత...రాధామోహన్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్లారు.
అలాగే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. దేశంలోనే పసుపు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నా.. పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర ప్రకటించే పంటల జాబితా కింద పసుపు పంటను కూడా చేర్చాలని, అలాగే ఇతర వాణిజ్య పంటల జాబితాలో పసుపును కూడా చేర్చాలని కోరారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన యాభై మంది పసుపు రైతులు కూడా వ్యవసాయ మంత్రిని కలిసి, తమ సమస్యలను వివరించారు. జిల్లాలో పండే పసుపుకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని జియోగ్రాఫికల్ గుర్తింపును ఇవ్వాలని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ కవిత ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓ వినతి పత్రాన్ని వ్యవసాయ మంత్రికి సమర్పించారు.